బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి.. అసంతృప్తి తగ్గేనా!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని గత కొన్ని రోజులు నుండి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం

Update: 2023-07-05 13:50 GMT

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని గత కొన్ని రోజులు నుండి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం కీలకం నిర్ణయం తీసుకుంది. రాజగోపాల్‌ రెడ్డిని బీజేపీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశం ఇప్పటి నుండే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నిన్న వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులతో పాటు, కీలకమైన పదవులకు నియామకాలు చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పదవి ఇచ్చారు. తెలంగాణలో ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇచ్చారు. ఈ నియామకాలతో రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు.

ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. దీంతో బీజేపీ వెంటనే అలర్టైంది. రాజగోపాల్‌ రెడ్డికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్‌ నుండి బీజేపీలో చేరిన రాజగోపాల్‌ రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది. ఆ స్థానం కోసం బీజేపీ నుండి పోటీ చేసిన రాజగోపాల్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతాలో ఓడిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌.. గతంలో రేవంత్‌ రెడ్డిని టీ పీసీసీ చీఫ్‌గా చేయడాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మొన్నటి కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీని కుంగుబాటుకు గురిచేశాయి. అప్పటి వరకు కేసీఆర్‌ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీనే అని అన్న రాజోగపాల్‌రెడ్డి.. ఆ తర్వాత నుంచి బీజేపీపై అసంతృప్తి స్వరం వినిపిస్తూ వచ్చారు.

బీజేపీ.. కేసీఆర్‌తో రహస్య ఒప్పందాలు చేసుకుంటోందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపైనా, ఆ తర్వాత రోజైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. అయితే బీజేపీ అధిష్ఠానం రాజగోపాల్‌రెడ్డిని పార్టీ మారకుండా చూసేందుకు పదవుల్లోనూ ప్రాధాన్యం ఇస్తామని చెప్పేందుకు, దానిని రుజువు చేస్తూ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించింది. ఈ పదవితోనైనా రాజగోపాల్‌ రెడ్డి అలక వీడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

Tags:    

Similar News