కేటీఆర్ సుడిగాలి పర్యటనలు.. అందుకేనట
కేసీఆర్ బాధ్యతలను తనయుడు కేటీఆర్ భుజాలకెత్తుకున్నారు. మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది
కేసీఆర్ బాధ్యతలను తనయుడు కేటీఆర్ భుజాలకెత్తుకున్నారు. మరికాసేపట్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు అనేది కొద్ది సేపట్లో తేలనుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. కొత్తగా పథకాలను ప్రభుత్వానికి ప్రకటించేందుకు వీలులేదు. ఇక ఏమి చెప్పాలన్నా బీఆర్ఎస్ మ్యానిఫేస్టోలో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అనుకున్న సమయం దగ్గరపడటం, కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ప్రచార బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు.
జిల్లాల్లో సుడిగాలి....
జిల్లాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ దాదాపు 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు రైతుబంధు ఛైర్మన్ గానూ, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. ఆయన ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. జనగామకు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇలా అన్ని సీట్లకు అభ్యర్థులు ఎంపిక కావడంతో కేటీఆర్ ప్రచార బాధ్యతలను తాను తీసుకున్నారు.
కోలుకోవడానికి...
కేసీఆర్ అస్వస్థతకు గురి కావడం, ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుండటంతో జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నాన్ని కేటీఆర్ చేస్తున్నారు. వరసగా అన్ని జిల్లాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అన్ని పార్టీల కంటే ఒకడుగు ముందు ఉండాలన్న లక్ష్యంతో కేటీఆర్, హరీశ్ రావులు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో పాటు బీజేపీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా...
కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16న తొలి విడత జాబితా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అంతా తానే అయి ప్రచారాన్ని వేగవంతం చేశారు. కేసీఆర్ తనయుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన అభ్యర్థులను జనాలకు పరిచయం చేస్తూ వారిని ఆశీర్వదించాలని కోరుతున్నారు. కేసీఆర్ కోలుకున్న తర్వాత ఆయన సభలు లిమిటెడ్ గా పెట్టినా పెద్దగా రాజకీయంగా ఇబ్బంది ఉండదని భావించి కేటీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు.