Nara Lokesh : యువగళం ప్రారంభించాలంటే.. అన్నీ అడ్డంకులే.. లోకేష్ ఏం చేయనున్నారు?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Update: 2023-11-03 14:01 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయన మరో నాలుగు వారాల పాటు బెయిల్ పై ఉంటారు. ఈలోపు న్యాయస్థానాల్లో కేసులు అనుకూలంగా వస్తే సరి. లేకుంటే తిరిగి జైలుకెళ్లాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై తీర్పును రిజర్వ్ చేసి ఉంది. అది తమకు అనుకూలంగా వస్తే వెల్ అండ్ గుడ్. లేకుంటే 28వ తేదీన చంద్రబాబు జైలు బాట పట్టక తప్పదు. మరోవైపు చంద్రబాబు పై వరస కేసులు నమోదవుతున్నాయి. కేసులన్నింటిలోనూ బెయిల్ రావాల్సి ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు.. అన్నింటిలో బెయిల్ వస్తేనే ఆయన బయట ఉండగలుగారు.

వరస కేసుల్లో...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసు, ఫైబర్ నెట్ కేసు.. మద్యం కేసు... ఇసుక కేసు ఇలా వరస కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ లభించినా వాటి గడువు కూడా ముగియనుంది. ఇప్పుడు అన్ని కేసుల నుంచి చంద్రబాబు బయటపడాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాజకీయ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు జరపకూడదని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో రాజకీయంగా మధ్యంతర బెయిల్ చంద్రబాబుకు పెద్దగా లాభించింది లేదు. కాకుంటే తనకు వైద్య పరీక్షలు, నెల రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకునే అవకాశం మాత్రమే చిక్కింది.
పార్టీని బలోపేతం చేయాల్సిన...
అయితే ఇదే తరుణంలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ పై ఉంది. నిన్న మొన్నటి వరకూ ఆయన చంద్రబాబుపై కేసుల కోసం ఢిల్లీ టు రాజమండ్రి తిరగడమే సరిపోయింది. న్యాయనిపుణలతో చర్చించడంతోనే కాలం గడిచిపోయింది. దీంతో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించి రెండు నెలలు పైగానే అయింది. ఈ ఏడాది సెప్టంబరు 8వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలో జరుగుతుంది. చంద్రబాబు అరెస్టయ్యారన్న వార్త తెలిసి తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపి అక్కడి నుంచి వచ్చేశారు. చంద్రబాబు ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చినా రాజకీయ వ్యవహారాలన్నీ లోకేష్ మాత్రమే చూసుకోవాల్సి వస్తోంది. యువగళాన్ని ప్రారంభించడానికి వీలుకుదరడం లేదు.
అంతా తానే అయి...
మరోసారి యువగళం యాత్ర ప్రారంభించాలనుకున్నా లోకేష్ మీద కూడా కేసులు నమోదు కావడం, సీఐడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయన యాత్ర చేపట్టడానికి వీలు కాలేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 150 రోజులు మాత్రమే సమయం ఉంది. లోకేష్ తన పాదయాత్రను తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకూ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి ఎంత లేదన్నా ముప్ఫయి రోజుల నుంచి నలభై రోజులు పడుతుంది. ఒకవేళ చంద్రబాబు కేసుల్లో అరెస్టయి జైలులోనే ఉండాల్సి వస్తే యాత్ర చేయడానికి వీలుండదు. అందుకే యువగళం పాదయాత్ర పై పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత లోకేష్ పైనే ఉండటం, పొత్తుల చర్చలు కూడా ఆయనే దగ్గరుండి చూసుకోవాల్సి రావడంతో యువగళం యాత్రపై అనుమానాలు బయలుదేరాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News