Ap Congress : గ్యారంటీలు కాదు కదా... ఏమిచ్చినా లేచే పరిస్థితి మాత్రం కష్టమే బాసూ.. చివరకు షర్మిల వచ్చినా
ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. వైఎస్ షర్మిల వచ్చినా ఓట్లలో పెద్దగా తేడా ఉండదన్న విశ్లేషణలున్నాయి
తెలంగాణ వేరు.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు అక్కడ గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడదీసిన పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో పేరుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా జనం మదిలో నుంచి ఆ వ్యతిరేకత పోలేదు. కాంగ్రెస్ పట్ల సానుకూలత అయితే లేదు. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు చోటు లేదు. కాంగ్రెస్ గత పదేళ్ల నుంచి ఏపీ శాసనసభలో కాలుమోపలేకపోయిందంటేనే దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో ఏపీలో కోలుకునే పరిస్థితి మాత్రం లేదు. ఎవరు వచ్చి జాకీలు పెట్టి లేపినా ఆ పార్టీ లేచే పరిస్థితి మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదన్నది యదార్థం.
అటు వైపు చూడరు గాక...
కాంగ్రెస్ ఆరు కాదు కదా... పది గ్యారంటీలు ఇచ్చినా ఏపీలో జనం మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపరు. హైదరాబాద్ నగరాన్ని తమ నుంచి విడదీశారన్న కోపం ఇంకా ఏపీ జనాల్లో ఉందన్నది వాస్తవం. హైదరాబాద్ లో ఏపీలోని ప్రతి ఇంటికి చెందిన ఇద్దరు ముగ్గురు ఉపాధి పొందుతున్నారు. వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని జనం ఇప్పటికీ కోపంగా ఉన్నారు. నాడు విభజన చేయకపోతే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్న అభిప్రాయం చాలా మందిలో ఇప్పటికీ కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ కు ఏపీలో అనుకున్నంత వాతావరణం మాత్రం లేదన్నది చెప్పవచ్చు.
డిపాజిట్లు కూడా...
2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ జగన్ ఎత్తుకెళ్లిపోయాడు. పదేళ్ల నుంచి హస్తం గుర్తునే మరచిపోయారు ఏపీ ప్రజలు. హస్తం నుంచి ఫ్యాన్ గుర్తు వైపు మళ్లిన వారు తిరిగి చూడాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. ఏపీ కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు. క్యాడర్ లేదు. ఓటు బ్యాంకు లేదు. ఇలా అన్ని రకాలుగా ఆ పార్టీ నెట్టుకొస్తుంది. జాతీయ పార్టీ కావడంతో ఇంకా కొందరు నేతలు ఆ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు కాని, అదే లేకుంటే అసలు ఆ పార్టీ ఊసే లేకుండా పోయేది. అసలు ఫలనా నియోజవర్గంలో ఆ పార్టీ గెలుస్తుందని చెప్పే ధైర్యమూ నేతలకు లేదు. అంతేకాదు ఆ పార్టీని కలుపుకుని వెళ్లేందుకు కూడా ఏ పార్టీలు కూడా ముందుకు రావడం లేదంటే పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోటీ చేసందుకు సరైన నేతలు కూడా లేరు.
ఎవరిని దింపినా...
ఇప్పుడు వైఎస్ షర్మిలను పార్టీ అధ్యక్షురాలిని చేసినా.. స్టార్ క్యాంపెయినర్ ను చేసి పంపినా ఒనగూరే ప్రయోజనం ఎంతమాత్రం లేదు. తాము వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతామని మాట ఇచ్చినా, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినా కూడా ఆ పార్టీ వైపు ప్రజలు చూసే పరిస్థిితి కనిపించడం లేదు. ఏపీలో ప్రాంతీయ పార్టీలదే హవా. అదీ వైసీపీ, టీడీపీల మధ్యనే గెలుపోటములుంటాయి. అంతే తప్ప కనీసం కొన్ని స్థానాల్లోనైనా గెలిచే పరిస్థితులు హస్తం పార్టీలో లేవన్నది మాత్రం యదార్థం. అంతేకాదు ఆ పార్టీ పోటీ చేయడం వల్ల అధికారంలో ఉన్న వైసీపీ ఓటు బ్యాంకును చీలుస్తుందని చెప్పుకోవడమూ హాస్యాస్పదమే అవుతుంది. ఇతర రాష్ట్రాలకు భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉండటం వల్లనే ఏపీలో కాంగ్రెస్ కు ఇప్పుడిప్పుడే మంచి రోజులు లేవని మాత్రం చెప్పడానికి ఎంత మాత్రం సంకోచించాల్సిన పనిలేదు.