Janasena : జనసేనలోకి చేరికలు.. ఆ నేత పార్టీలో చేరితే...?
విజయవాడ తూర్పు నియోజకవర్గం నేత యలమంచిలి రవి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా 150 రోజుల మాత్రమే సమయం ఉంది. అయినా సరే ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. పొత్తులు అధికారికంగా కుదుర్చుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారయిన నేపథ్యంలో తమకు టిక్కెట్ దక్కదని భావిస్తున్న నేతలు పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీలో చేరేకన్నా జనసేనలో చేరితే సీటు దొరకడంతో పాటు అదృష్టం బాగుంటే మంత్రి పదవి కూడా దక్కుతుందని భావించి ఎక్కువ మంది నేతలు జనసేన వైపు చూస్తున్నారు.
వైసీపీ, టీడీపీలో...
ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నేత యలమంచిలి రవి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు వైసీపీలో సీటు రాదు. ఇప్పటికే దేవినేని అవినాష్ ను ఆ పార్టీ ఇన్ ఛార్జిగా నియమించింది. టీడీపీలోకి వెళ్లినా పెద్దగా ప్రయారిటీ ఉండదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఉన్నారు. అందుకే ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యలమంచిలి రవి పార్టీ నేతలతో మాట్లాడినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మంచి ముహూర్తం చూసుకుని జంప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.
ఒకసారి ఎమ్మెల్యేగా...
యలమంచిలి రవి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రవి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తనకు టిక్కెట్ దక్కకపోవడం, టీడీపీలో ప్రయారిటీ లభించకపోవడంతో 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ లో చేరారు. అయినా అక్కడ కూడా యలమంచిలి రవికి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ నగరంలో పశ్చిమ, తూర్పు జనసేన పొత్తులో భాగంగా సీట్లు కోరితే రవికి సీటు దక్కే అవకాశముందని తెలుస్తుంది. ఇప్పటికే తన అనుచరులతో సమావేశమైన యలమంచిలి రవి త్వరలోనే జనసేనలో చేరేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.