అదే కారణం
జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డెడ్‌లైన్ విధించారు
జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డెడ్‌లైన్ విధించారు. ఈ నెల 30వ తేదీలోపు పార్టీ విలీనంపై సానుకూల ప్రకటన రాకపోతే తాము తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు. షర్మిల ఇచ్చి అల్టిమేటంకు కాంగ్రెస్ హైకమాండ్ ఇంత వరకూ స్పందించలేదు. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయం దాటి పోతే ఇక విలీన ప్రక్రియ లేనట్లే అనుకోవాలి. షర్మిల షరా మామూలుగానే వైఎస్సార్టీపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు.
అన్ని నియోజకవర్గాల్లో…
వచ్చే నెల నుంచి పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొంటామని, 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతామని షర్మిల ప్రకటించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిల అల్టిమేటం ఇచ్చి మూడు రోజులవుతున్నా లైట్ గానే తీసుకున్నట్లు కనిపిస్తుంది. రాస్ట్ర నేతల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు మినహాయించి ఎవరూ పెద్దగా షర్మిల పార్టీ విలీనానికి ఇష్టపడటం లేదు. అందుకు అనేక కారణాలు చెబుతున్నారు.
నాటి సీన్ రిపీట్…
తాము షర్మిలను చేర్చుకుంటే 2018 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నాడు చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు సానుకూలంగా మలచుకున్నారని, ఇప్పుడు షర్మిలను చేర్చుకుంటే అదే ఫార్ములాతో మళ్లీ కేసీఆర్ జనంలోకి వెళ్లే అవకాశముందని కొందరు హైకమాండ్ నేతలకు చెప్పినట్లు తెలిసింది. షర్మిలను పార్టీలో చేర్చుకున్నా, ఆమె పార్టీని విలీనం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని,,అయితే ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం చేయాలని పలువురు నేతలు హైకమాండ్ కు గట్టిగా చెప్పినట్లు సమాచారం.
లైట్ తీసుకున్నట్లేనా?
ఈ కారణంతోనే మరొకసారి ప్రయోగం చేయడం ఎందుకని హైకమాండ్ షర్మిల పార్టీ విలీనం విషయంలో డైలమాలో ఉన్నట్లు తెలిసింది. షర్మిల పార్టీ విలీనం అయినా రాకపోయినా ఒక సామాజికవర్గం ఇప్పటికే కాంగ్రెస్‌కు అండగా ఉందన్న నివేదికలు కూడా ఆమె రాకకు రెడ్ సిగ్నల్ ఇచ్చాయంటున్నారు. రెడ్డి సామాజికవర్గం ఎటూ కాంగ్రెస్ వైపు ఉండటంతో ప్రత్యేకంగా షర్మిలను చేర్చుకుని సాధించిందేముంటుందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అందుకే అల్టిమేటానికి కూడా పెద్దగా స్పందించడం లేదని కొందరు నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో షర్మిల ఒంటరిగానే పోటీ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది.