Cock Fight : కోటి గెలుచుకున్న కోడి.. రికార్డు క్రియేట్ చేసిందిగా
తాడేపల్లి గూడెంలో జరిగిన ఒక పందెం మాత్రం ఆకట్టుకుంది. గుడివాడ ప్రభాకర్ కోడి పుంజు కోటి రూపాయలు గెలుచుకుంది;
సంక్రాంతికి ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బరులను ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పందేల్లో పోగొట్టుకున్న వారు విషాదవదనాలతో ఇంటి ముఖం పట్టగా, గెలుచుకున్న వారు ఆనందంతో కేరింతలు కొడుతూ ఇంటికి పయనమయ్యారు. ఈసారి కోడిపందేలు మామూలుగా జరగలేదు. కోట్ల రూపాయల భారీ పందేలతో పాటు గెలిచిన కోళ్ల యజమానులకు కార్లు, బుల్లెట్ బైకులు వంటివి కూడా బహుమతులుగా దక్కాయి. అందుకే ఈసారి గతంలోఎన్నడూ లేని విధంగా తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో కోడిపందేల్లో ఎక్కువ మంది పాల్గొన్నారని చెబుతున్నారు.
తాడేపల్లి గూడెం బరిలో...
అయితే ఒకే ఒక కోడిపందెం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఒక్క కోడి పందెం విలువ కోటి ఇరవై ఐదు వేల రూపాయలు కావడంతో అందరి దృష్టి ఆ బరిపైనే పడింది. అయితే తాడేపల్లి గూడెంలో జరిగిన ఒక పందెం మాత్రం ఆకట్టుకుంది. ఈ బరి వద్దకు వేల సంఖ్యలో పందెంరాయుళ్లు రావడంతో అక్కడ ప్రయివేటు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కోడిపందేల్లో ఆరితేరిన కోడి కింగ్ గా పేరు గాంచిన రత్తయ్య పుంజు ఇందులో పాల్గొనడమే. ఈ సారి ఇక్కడ ఏలూరు జిల్లా రంగాపురానికి చెందిన రత్తయ్య కోడితో, గుడివాడ ప్రభాకర్ రావు కోడి పోటీ పడింది. చివరకు గుడివాడ ప్రభాకర్ కోడి గెలవడంతో 1.25 కోట్లను ప్రభాకర్ రావు సొంతం చేసుకున్నాడు.
పై పందేలు కాసినవాళ్లు...
కోడి పందేల్లో రత్తయ్యకు ఉన్న ట్రాక్ రికార్డును చూసి ఎక్కువ మంది ఆయన పుంజుపై పై పందేలు పెట్టారు. గతంలో అనేక సార్లు రత్తయ్య బరిలోకి వదిలిన పుంజు ఎక్కువ సార్లు గెలవడంతో పందెం రాయుళ్లు ఏమీ ఆలోచించకుండా పందేలు కాశారు. అంతేకాదు కుక్కుట శాస్త్రం అనుసరించి ఈ పందెం జరగ్గా చివరకు కింగ్ కోడి రత్తయ్య పుంజు ఓడి చచ్చిపోయింది. గుడివాడ ప్రభాకర్ పుంజు పై చేయి సాధించింది. దీంతో ఈ పందెంలో 1.25 కోట్లు గెలుచుకుని ప్రభాకర్ ఈ ఏడాది జరిగిన పందేల్లో అత్యధిక మొత్తాన్ని గెలుచుకున్న విజేతగా నిలిచాడు. హోరాహోరీగా జరిగిన ఈ పందేన్ని చూసేందుకు వేలాది మంది తరలి రావడంతో అక్కడ స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగిందని చెబుతున్నారు.