Sankranthi Sweets : సంక్రాంతికి ఈ స్వీట్లు తినకపోతే ఇక వేస్టే... అలా ఉంటాయ్ మరి

సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు...గంగిరెద్దులు మాత్రమే కాదు. స్వీట్లు;

Update: 2025-01-12 04:49 GMT

సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు...గంగిరెద్దులు మాత్రమే కాదు. స్వీట్లు. రైతులకు పంట చేతికొచ్చే సమయం కావడంతో ప్రతి ఇంటా ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతాయి. ఏ ఇంట చూసినా స్వీట్ల తయారీతో పొయ్యిలు నిత్యం వెలిగిపోతుంటాయి.ఇంటికి వచ్చే బంధువుల కోసం, దూర ప్రాంతాల ఉన్న వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసి మరీ ఈ సంక్రాంతి పండగకు రాని వాళ్లకు కూడా స్వీట్లను పంపడం సంప్రదాయంగా వస్తుంది. అయితే శీతాకాలంలో తయారు చేసే ఈ స్వీట్లకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉంటాయని పెద్దలు చెబుతారు. అందుకే సంక్రాంతి పండగ కోసం ప్రత్యేకించి కొన్ని రకాల స్వీట్లను మాత్రమే తయారు చేస్తారు.

అరెసెలు అదిరిపోతాయి...
దేని రుచి దానిదే. ఆ స్వీట్ పేరు ఉంటేనే నోట్లో నుంచి లాలాజలం ఊరిపోతుంది. సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసే స్వీట్లలో ప్రధానమైదని అరిసెలు. అనేక రకాలుగా అరెసెలను తయారు చేస్తారు. బెల్లంతో తయారు చేసిన అరిసెలను ఎక్కువ మంది ఈ సంక్రాంతికి తయారు చేస్తారు. అరిసెలు లేని సంక్రాంతి పండగ ఏ ఇంటా ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో అరిసెలను తయారు చేయడం పండగకు ముందు పది రోజుల నుంచే ప్రారంభిస్తారు. బియ్యాన్నిరోట్లలో దంచి ఒకప్పుడు అరిసెల కోసం బియ్యపు పిండిని తయారు చేస్తారు. ఆతర్వాత అందులో బెల్లాన్ని కలుపుతారు. బెల్లం పాకం పట్టి అందులో నువ్వులను కూడా జోడించి నూనెలో వేయించి తయారు చేస్తారు. అరెసెలు ఆరోగ్యానికి మంచిదంటారు. రక్తాన్ని శుభ్రంచేయడమే కాకంుండా బెల్లం కావడంతో ఐరన్ కూడా శరీరానికి పుష్కలంగా లభిస్తుందని పెద్దలు చెబుతారు.
సున్నండలు.. జంతికలు...
ఈ సంక్రాంతికి తయారయ్యే మరో ప్రత్యేక వంటకం సున్నండలు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ వంటకం ప్రతి ఇంటా కనిపిస్తుంది. మినపప్పు, నెయ్యి,బెల్లంతో దీనిని తయారుచేస్తారు. మినుములు శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే బెల్లం కూడా ఐరన్ అందించడంతో శీతాకాలంలో అదీ సంక్రాంతి వేళ ఈ పిండి వంటకం కూడా ప్రత్యేకమే.ఇక సంక్రాంతికి తయారు చేసే జంతికలు కూడా ప్రత్యేకత సంతరించుకున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ సంక్రాంతి వేళ ఈ జంతికలు కనిపిస్తాయి. బియ్యం, పెసరపప్పు, శనగపిండి, ఉప్పు, కారంతో దీనిని తయారు చేస్తారు. అరిసె తిన్న తర్వాత ఖచ్చితంగా జంతికలు తినాల్సిందే. ఎందుకంటే ఇందులో వాము ను కూడా కలుపుతారు కాబట్టిసులువగా జీర్ణం అవుతుంది. కారంగా, ఉప్పగా ఉండే ఈ జంతికలు ప్రత్యేక రుచిని కలిగి ఉండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సాయంత్రం వేళ దీనిని నోట్లో వేసుకుని తీరాల్సిందే. అందుకే సంక్రాంతి వేళ కేవలం కోడిపందేలు మాత్రమే కాదు.. పసందైన రుచులు కూడా. అందుకే సంక్రాంతి అంటేనే స్పెషల్ స్వీట్స్ అని చెప్పక తప్పదు.


Tags:    

Similar News