సాహసమే చేయడమే...
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ను చేయడమే ఒక సాహసంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే హైకమాండ్ ఈరకమైన ప్రయోగం మరెక్కడా చేయలేదు. రేవంత్ పై హైకమాండ్ పెట్టుకున్న నమ్మకం అలాంటిది. ఆ నమ్మకాన్ని రేవంత్ కూడా వమ్ము చేయలేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఆయన అందరినీ కలుపుకుని పోయాడు. చివరకు తనను వ్యక్తిగతంగా వ్యతిరేకించి బీజేపీలో చేరి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఆయన అడ్డు చెప్పలేదు. అలా ఆయనను అందరినీ కలుపుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇది గెలుపునకు ఒక కారణంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా అంత సులువుగా సాగలేదు. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా...ఎంపీగా గెలిచి చివరకు కాంగ్రెస్ ను గెలిపించే స్థాయికి ఎదిగాడంటే.. లీడర్ కానే కాదు... ఆయన ఫైటర్ అని చెప్పాలి. సుదీర్ఘంగా అధికార పార్టీతో పోరాడిన నేతగా ఆయన తనను తాను ప్రజల్లో ఒక ఫేమ్ సంపాదించుకోగలిగాడు.
మాటల పుట్ట...
మరోవైపు రేవంత్ రాష్ట్రమంతటా పర్యటించారు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగారు. మామూలుగా మాటల్లో కేసీఆర్ ను మించిన వారు లేరంటారు. కానీ రేవంత్ మాత్రం కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పడు కౌంటర్లు ఇస్తూ జనంలో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యువత, మహిళలలో ఆయన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ప్రధానంగా కీలకమైన రెడ్డి సామాజికవర్గం ఓటు బ్యాంకును రేవంత్ వల్లనే ఏకపక్షంగా కాంగ్రెస్ కు టర్న్ అయిందనే చెప్పాలి. దీంతో పాటు తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు కూడా రేవంత్ వెంట నడిచాయి. టీడీపీ అభిమానులు ఇప్పటికీ ఆయనను తమ నేతగానే చూస్తుండటం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అదనపు బలంగా మారింది.
వన్ మ్యాన్ షో...
రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అందరూ కలసి కట్టుగా పనిచేసినా రేవంత్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎక్కువగా పనిచేసిందనే అనుకోవాల్సి ఉంటుంది. ఎంతో మంది సీనియర్ నేతలున్నా గతంలో కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనలేకపోయారన్న విమర్శలున్నాయి. కానీ రేవంత్ అలా కాదు. తొలి నుంచి ఎఫెన్స్ లోనే ఆయన పార్టీని ముందు నిలిపాడు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అధికార పార్టీపై అసంతృప్తి కొంత కారణమైతే రేవంత్ నాయకత్వమూ కారణమని చెప్పకతప్పదు. అందరూ అంగీకరించాల్సిన విషయం ఏంటంటే... రేవంత్ పై ఉన్న కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఈ విజయంతో మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. అందుకే ఈ విజయాన్ని రేవంత్ కు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు.