ACB : శివబాలకృష్ణ కేసులో....ఐఏఎస్ అరవింద్‌కుమార్... పేరు.. విచారణకు ఏసీబీ సిద్ధమయిందా?

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు వినిపిస్తుంది

Update: 2024-02-10 03:23 GMT

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏసీబీ విచారణలో పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో హెచ్‌ఎండీఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన పేరును శివబాలకృష్ణ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఆయన సూచన మేరకే అనుమతులు మంజూరు చేసినట్లు కూడా శివబాలకృష్ణ విచారణలో వెల్లడించారని సమాచారం. దీంతో అరవింద్‌కుమార్ మెడకు ఈ అవినీతి ఉచ్చు బిగుసుకుంటుందన్న కామెంట్స్ ఐఏఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు తాను చేసినట్లు శివబాలకృష్ణ తెలపడంతో ఇప్పుడు ఫోకస్ అంతా ఆయనపైనే ఉంది

రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి...
వివిధర రియల్ ఎస్టేట్ కంపెనీలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లలో శివబాలకృష్ణ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో కనుగొన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క శివబాలకృష్ణ వల్లనే ఇది సాధ్యం కాదని అనుమానించిన ఏసీబీ అధికారులు ఆయనకు సహకరించిన, ఆయనను ప్రేరేపించిన ఐఏఎస్ అధికారుల చిట్టాను కూడా బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. శివబాలకృష్ణ తన కన్‌ఫెషన్ స్టేట‌్‌మెంట్‌లోనూ అరవింద్ కుమార్ పేరు ప్రస్తావించాడని చెబుతున్నారు. అయితే ఐఏఎస్ అధికారులను కూడా విచారించేందుకు ప్రభుత్వ అనుమతిని తీసుకునే ఏర్పాట్లలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత...
శివబాలకృష్ణ చెప్పిన విషయాల్లో ముఖ్యమైన మరొక అంశం కూడా ఉంది. నార్సింగిలో ఒక స్థిరాస్థి వ్యాపారి నుంచి ఐఏఎస్ అధికారి పదికోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అందులో తొలి వాయిదాగా కోటి రూపాయలు ఇచ్చినట్లు శివబాలకృష్ణ ఒప్పుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అని, ఆయనకు శివబాలకృష్ణతో ఆయనకు సాన్నిహిత్యం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారణ చేసే అవకాశముంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అప్పటి మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారన్న పేరుంది. దీంతో అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు.
వందల కోట్ల ఆస్తులు...
శివబాలకృష్ణ ఆస్తులు దాదాపు నాలుగు వందల నుంచ ఐదు వందల కోట్ల రూపాయలు దాటాయి. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటంతో ఆయన అక్రమాస్తులను బాగానే వెనకేసుకు వచ్చారన్న అనుమానాలున్నాయి. అయితే ఆయన ఆస్తులను పరిశీలిస్తున్నప్పుడు, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు ఏసీబీ అధికారులు ఈయనకు సహకరించిన వారెవరన్న దానిపై కూడా ఆరా తీశారు. అందులో భాగంగానే ఐఏఎస్ ల పేర్లు బయటకు వచ్చాయని చెబుతున్నారు. మొత్తం మీద శివబాలకృష్ణ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఐఏఎస్ ల మెడకు చుట్టుకుంటోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీయడంలో భాగంగా ఇంకా అనేక మంది ఉన్నతాధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశముందంటున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఈ కేసులో ఎందరి పేర్లు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News