బేషరతు అజెండా కుదిరింది…?

ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అవినీతి తీవ్రం కావడంతో 2012-13 సంవత్సరాల మధ్యలో కాంగ్రెసు నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ప్రజల్లో [more]

Update: 2021-05-14 16:30 GMT

ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అవినీతి తీవ్రం కావడంతో 2012-13 సంవత్సరాల మధ్యలో కాంగ్రెసు నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం నెలకొంది. అదే తరహాలో కోవిడ్ కట్టడిలో అసమర్థత కారణంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పై ఇప్పుడు ప్రజల్లో మరింత ఆవేశం కనిపిస్తోంది. అప్పుడు ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలనే ప్రజలు చూశారు. ఇప్పుడు ప్రాణాలే పోతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోతున్నారు. ఎన్డీఏ కు ఇది తీవ్రమైన ప్రమాద సంకేతమే. ఇంతవరకూ ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడానికి అజెండా దొరకలేదు. కరోనా కారణంగా వారంతా బేషరతుగా ఏకం కావడానికి అజెండా దొరికింది. వేరే సందర్భంలో ప్రతిపక్షాలు ఏకమైతే అధికార లాలసతో జట్టు కడుతున్నారని విమర్శలకు ఆస్కారం ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో ఐక్యత ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఈ రకమైన స్పందననే ప్రతిపక్షాల నుంచి కోరుకుంటున్నారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిసా వంటి రాష్ట్రాలోని కొన్ని ప్రాంతీయపార్టీలు మినహా దేశంలోని చాలా పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే వేదిక మీదకు రావడానికి సన్నద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

నాయకత్వం కావాలి…

కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, చట్ట సభల సముదాయమైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ కాంగ్రెసు, తృణమూల్ సహా దేశంలోని వివిధ పార్టీలు ప్రధానిని డిమాండ్ చేశాయి. దానికి తోడు బడ్జెట్లో పెట్టిన కరోనా వాక్సిన్ల పద్దులోని 35 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఇంతవరకూ కేంద్రం ఈ పద్దులోని అయిదువేల కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసింది. 21 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్బర ప్యాకేజీ తరహాలోనే వాక్సిన్ల బడ్జెట్ సైతం దేవతా వస్త్రం చేద్దామనే యోచనలో ఉంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో డిమాండ్ ఛేయడంతో ఆ సొమ్మును ఖర్చు పెట్టక తప్పని పరిస్తితి ఏర్పడింది. వాక్సిన్ సొమ్ములను పూర్తిగా విడుదల చేయాల్సిన అవసరం లేదని , ఏదో పద్దు కోసమే పెట్టామని కేంద్రం భావించింది. అందుకే ఆ నిధులతో ముందస్తుగా వాక్సిన్ ఆర్డర్లు బుక్ చేయలేదు. ఆ నిధులను మొత్తంగా వెచ్చిస్తే రాష్ట్రప్రభుత్వాల చేతి నుంచి పైసా కూడా ఖర్చు పెట్టకుండా అందరికీ వాక్సిన్లు వేయవచ్చు. కానీ రాష్ట్రాలను రంగంలోకి దింపి వాటి చేత ఖర్చు పెట్టించాలనేది కేంద్రం యోచన. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలకు ప్రజా మద్దతు కూడగట్టే అజెండా దొరికింది. అయితే అందర్నీ కలిపి ఉంచే నాయకత్వం కొరత ఇంకా వెన్నాడుతూనే ఉంది.

ఆమె తప్పుకుంటారా..?

యూపీఏ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ రెండుసార్లు కాంగ్రెసును అధికారంలోకి తేవడంతోపాటు విపక్షాల ఐక్యతకు కేంద్రంగా నిలిచారనే చెప్పాలి. అయితే పార్టీ బలహీనపడటంతో కూటమి సహజంగానే తన ప్రాధాన్యాన్ని కోల్పోయింది. పైపెచ్చు యూపీఏలోని మిగిలిన పార్టీల కంటే సారథ్యం వహిస్తున్న కాంగ్రెసు అపజయాలే ఎక్కువగా ఉన్నాయి. మిత్రపక్షాలు కాంగ్రెసుతో జట్టు కట్టాలంటే భయపడుతున్నాయి. బిహార్ లో కాంగ్రెసు పార్టీకి ఇచ్చిన సీట్ల కారణంగానే ఆర్జెడీ అధికారంలోకి రాకుండా పోయిందనే వాదన ఉంది. అందువల్లనే దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీతో చేతులు కలిపేందుకు ఏ ఒక్కపార్టీ సిద్దంగా లేదు. ముందుగా కాంగ్రెసు సంస్థాగతంగా బలోపేతం కావాల్సి ఉంది. రాహుల్, ప్రియాంకలలో ఎవరో ఒకరు బాధ్యతలు స్వీకరించకపోతే సోనియా పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా కొనసాగక తప్పని అనివార్యత ఏర్పడుతుంది. అటువంటప్పుడు యూపీఏ కార్యనిర్వాహక బాధ్యతలనుంచి తప్పుకుని గౌరవ హోదాలో కొనసాగుతూ యాక్టివ్ గా ఉండే మిత్రపక్షాలకు ఛైర్మన్, కన్వీనర్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే సూచనలు వెలువడుతున్నాయి. శరద్ పవార్, మమతా బెనర్జీలు ఈ రెండు పదవులకూ న్యాయం చేస్తారనే ప్రచారమూ మొదలైంది.

కొత్త టెంటు వేస్తారా..?

సోనియా యూపీఏ ను వదులుకోవడానికి ఇష్టపడకపోతే ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక కూటమి అవకాశాలను అన్వేషించవచ్చని తెలుస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వం పట్ల పూర్తి సానుకూలత వ్యక్తం కావడం లేదు. శరద్ పవార్ అయితే దాదాపు అన్ని పార్టీలు సూత్రప్రాయంగా అంగీకారం తెలపవచ్చనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఆయనకున్న సీనియారిటీ ,అన్ని పార్టీల అగ్రనేతలతో సంబంధాలు ఇందుకు దోహదం చేస్తాయి. అంతే కాకుండా పవార్ తన రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారు. అందువల్ల భవిష్యత్తులో తమకూ కూటమికి నాయకత్వం వహించే అవకాశం వస్తుందనేది ప్రాంతీయ నాయకుల ఆశ. అయితే తాజాగా మమత బెనర్జీ మాత్రమే మోడీని ఎదిరించే పవర్ పుల్ లీడర్ గా ప్రజల్లో పాపులర్ అవుతున్నారు. ఆమె అంగీకరించకుండా కూటమి కట్టడం , పవార్ పగ్గాలు చేపట్టడం అసాధ్యం. సోనియా నే దిగి వచ్చి యూపీఏ లోనే నాయకత్వం మార్పునకు అంగీకరిస్తే అసలు సమస్యే ఉత్పన్నం కాదు. అప్పుడు ఎంపిక ఆమె చేతిలో ఉంటుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News