రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు అని తెలిసిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ లో ఓ కొత్త వేవ్ మొదలైంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తమ పార్టీ కి తిరిగి మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ జోష్ చూస్తూ ఉంటే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు నిశ్చయం అన్నంత కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నాంపల్లి లోని గాంధీభవన్ నేతలతో, ఆశావహులతో కీటకితలాడుతోంది. ప్రతిరోజు చేరికలు, కొత్త ప్రణాళికలు, వ్యూహరచనలతో పార్టీ ఆఫీస్ బిజీబిజీగా సాగుతోంది. ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రజా ప్రతినిధులు, నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలు ఒకరినొకరు పోటీ పడి జాయినింగ్స్ చేయిస్తున్నారు. ఈ చెరికలతో పాటు స్వచ్చందంగా పార్టీ వైపు వస్తున్నవాళ్ళ సంఖ్య కూడా తక్కువలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పై ఏర్పడ్డ వ్యాక్యూమ్ తో ఇన్నాళ్ళూ దిక్కుతోచక కూర్చున్న చాలామంది ఔత్సాహికులకి కాంగ్రెస్ దివ్యౌషధంగా కనిపిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, వివిధ పార్టీల మండలాధ్యక్షులు క్యూ లైన్ కట్టి మరీ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు.
చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కనబరుస్తున్న స్పీడ్ మిగతా రెండు పార్టీలు బిజేపి, బీఆర్ఎస్‌లలో కనిపించడం లేదు. ఢిల్లీ వేదికగా కొందరు మాజీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బిజేపి తీర్థం పుచ్చుకుంటున్నారే తప్ప ప్రస్తుత ప్రజాప్రతినిధులు అంతగా ఆసక్తి చూపించడం లేదు అని కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం చేరికలు జరగని పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కనిపిస్తోంది. కేసీఆర్ పాలన పై రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడ్డ ప్రజావ్యతిరేకత వల్ల ఆ పార్టీని వీడి వస్తున్నారు లీడర్లు. వీళ్ళలో సర్పంచ్‌లు, ఎంపిటీసీలు అధికంగా ఉంటున్నారు. బీఆర్‌ఎస్ రెండో టర్మ్ పాలనలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేందుకు అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కొందరు సర్పంచ్‌లు అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. గ్రామస్థాయిల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో ఈ పరిణామాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో మహిళా నేతలు, ముఖ్యంగా మున్సిపల్ ఛైర్మన్‌లు చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడి బయటికొస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరుల ఆగడాలకు వేగలేక చాలామంది మహిళా నేతలు మానసిక క్షోభతో రిజైన్ చేసి పార్టీలు మారుతున్నారు. అలాంటి కొందరు మహిళలు మొన్నటివరకూ బిజేపి పార్టీ వైపు వెళ్ళారు. ఈమధ్యకాలంలో అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలు, వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కదనే అనుమానంతో ఉన్నవాళ్ళు ప్రస్తుతం హస్తం గూటికి చేరాలనే ఆలోచనలో ఉన్నారు. జిల్లాల వారిగా చూస్తే కొందరు నేతలు మూకుమ్మడిగా వెళ్ళి చేరిపోతున్నారు. అలా చేస్తే రేపు కేసీఆర్ ఆగ్రహాన్ని అందరూ కలిసికట్టుగా ఎదరుకోవచ్చని భావిస్తున్నారు.
బిజేపి పార్టీలో క్రిందిస్థాయి నేతలు ఎవరూ కూడా పార్టీని వీడే ఆలోచనలో లేరనిపిస్తోంది. గత నాలుగేళ్ళ కాలంలో కాషాయం కండువా కప్పుకున్న బడా నేతలు మాత్రమే ఆ పార్టీని వీడుతున్నారు. అలాంటి నేతలు మొన్నటివరకూ బీఆర్ఎస్ తలుపులు తడితే.. నిన్నా మొన్నా బయటికి వచ్చినవాళ్ళు కాంగ్రెస్ వైపు ఆశావహులుగా సాగుతున్నారు. ఓట్ బ్యాంక్ పుంజుకున్నా.. బిజేపి పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని నెలకొల్పేంత సత్తా లేదు. లెక్కపెడితే వేళ్ళకే సరిపోయేంత గెలుపు గుర్రాలు మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ మీద విపరీతమైన యాంటి ఇంకుబెన్సీ ఏర్పడి, మోడి వేవ్‌ని తీసుకుని రాగలిగితే బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఫాలోవర్ల ఆశ. కానీ ఆ కోరికని నిజం చేసి సాధించగలిగే నాయకత్వ పటిమ, సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళే నాయకుడు ప్రస్తుతం కరువయ్యారు. పార్టీలోని పెద్దల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల బిజేపిలో క్యాడర్‌లో కూడా అంతర్గత చీలికలు ఏర్పడ్డాయి. ఇలాంటి డిఫరెన్సస్ ఎన్నికల వరకూ కొనసాగితే.. బిజేపి పార్టీ ఓటమికి తమ సొంత క్యాడరే కారణమవుతుంది. బిజేపిలో జరుగుతున్న అంతర్గత కొట్లాటలు బయట ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తుండటంతో.. బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ ఆశావహులు కానీ కాషాయ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ చూస్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్ స్నోబాల్ ఎఫెక్ట్‌తో దూసుకుపోతుంది అని స్పష్టంగా తెలుస్తుంది.