నగరిలో మేడమ్‌కు మామూలుగా లేదుగా
ఈసారి ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో పోటా పోటీ ఎన్నిక జరుగుతుంది. ఆర్కే రోజాకు ప్రత్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలు ప్రతి నియోజకవర్గంలో పోటా పోటీగా జరగనున్నాయి. ఏదీ వన్ సైడ్ ఎన్నికగా చూడలేని పరిస్థితి. ఇటు అధికార పక్షానికి అటు విపక్షానికి కూడా ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపు అంత సులువు కాదు. అన్ని రకాలుగా ప్రయత్నించాలి. ప్రజల అభిమానాన్ని పొందాలి. అధికార పార్టీ అయితే ఎంతో కొంత ఉన్న వ్యతిరేకత నుంచి బయటపడాలి. అలాగే విపక్షంలోనూ కూటములు సహకరించుకోవాలి. ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో ఉన్న ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కే రోజాపై ప్రత్యర్థి ఎవరన్న చర్చ జరుగుతుంది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎవరు రోజాపై పోటీ చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
పొత్తు ఖరారయ్యాక..
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులు ఖరారయ్యాయి. కూటమిలో బీజేపీ చేరే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే జనసేన తాము పోటీ చేయాల్సిన స్థానాలపై ఒక క్లారిటీకి వచ్చింది. సీట్ల ఒప్పందం సమయంలో కొన్ని సీట్లను జనసేన పార్టీ పట్టుబట్టి తీసుకునే అవకాశముంది. కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకే కాకుండా రాయలసీమలోనూ తమ జెండా ఎగరాలని జనసేన భావిస్తుంది. అందుకే చిత్తూరుపై జనసేన కన్నేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, మదనపల్లి, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించింది. ఆ నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో తామే పోటీ చేయాలని జనసేన భావిస్తుంది.
గాలి కుటుంబంలో...
అయితే టీడీపీ కూడా నగరి నియోజకవర్గంలో బలంగా ఉంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు జీవించి ఉన్నంత కాలం టీడీపీకి అక్కడ తిరుగులేదు. కానీ వరసగా రెండుసార్లు ఆర్కే రోజా నగరి నుంచి గెలిచారు. వైసీపీలో గ్రూపులున్నాయి. రోజాకు వ్యతిరేకంగా అనేక గ్రూపులుండటంతో విపక్షం సులువుగా గెలుస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీలోనూ సీన్ అంత బాగా లేదు. గాలి కుటుంబంలో విభేదాలు రోజాకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. గాలి కుమారులు జగదీష్, భానుప్రకాష్‌ల మధ్య విభేదాలు బలంగా ఉన్నాయి. ఇద్దరూ తాము బరిలో ఉంటామని చెబుతున్నారు. ఒకరికి టిక్కెట్ ఇస్తే మరొకరు సహకరించని పరిస్థితి నగరి టీడీపీలో నెలకొంది. గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి తర్వాత కుటుంబం రెండు ముక్కలుగా చీలిపోయిందనే చెప్పాలి.
టిక్కెట్ ఎవరికి?
ఈ పరిస్థితుల్లో వీరిద్దరికి టిక్కెట్ ఇవ్వకుండా జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తే అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థి ఒకసారి అక్కడ కాలుమోపితే తమకు అక్కడ కాలు నిలిపేంుదకు చోటు ఉండదని టీడీపీ నేతలు ఇప్పటికే తమ పార్టీ అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. టీడీపీ హైకమాండ్ భానుప్రకాష్ కు మద్దతుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజాపై ప్రత్యర్థి ఎవరు ఉంటారన్న చర్చ జరుగుతుంది. రోజాను ఓడించి తీరాలని జనసేన కసితో ఉంది. తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి తమ పగను తీర్చుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. అందుకే నాగబాబు ప్రత్యేకంగా నగరి నియోజకవర్గం నేతలతో సమీక్ష నిర్వహించారు. మరి చివరకు రోజా ప్రత్యర్థి ఎవరు అవుతారన్నది చూడాల్సి ఉంది.