Arhad Nadeem : పేదరికం అడ్డురాలేదు... దూరం చేసి విసిరేశాడు అర్హద్ నదీమ్
పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్హద్ నదీమ్ పేదరికం నుంచి ఛాంపియన్ గా మారాడు.
పేదరికానికి నైపుణ్యం అడ్డురాదు. పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్హద్ నదీమ్ జీవిత చరిత్ర వింటే ఎవరైనా ఆశ్చర్యపోకతప్పదు. భారత్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మీద విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితికి ఆ దేశం కనీసం నదీమ్ కు స్పాన్సర్ చేయలేని పరిస్థితి. పాకిస్థాన్ క్రీడా సంఘం నదీమ్ కు మాత్రం కొంత ఫైనాన్స్ చేసింది. అది పేదరికంలో నదీమ్ పుట్టాడు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలో ఖనేవాల్ గ్రామంలో నదీమ్ జన్మించాడు.
సరైన తిండి కూడా లేక...
నదీమ్ ఇంట్లో తిండి కూడా సరైనది తినడానికి లేదు. మొత్తం ఏడుగురు సోదరుల్లో నదీమ్ మూడో వాడు. తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తాడు. వారి ఇంట్లో పరిస్థితిని చూసిన వారికి ఎవరికైనా గుండె తరుక్కుపోదు. నదీమ్ చిన్న తనంలో ఆ కుటుంబంలో ఏడాదికి ఒక్కసారే మాంసాహారం తినేవారు. అంటే ఎంత దారుణంగా ఆర్థిక పరిస్థితి ఉందో ఇట్లే చెప్పవచ్చు. నదీమ్ లోని చురుకుదనాన్ని చూసి చివరకు గ్రామస్థులే విరాళాలు వేసుకుని మరీ పంపారు.
ఆటల్లో ముందుండి...
చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండే నదీమ్ క్రికెట్ అంటే తొలుత ఇష్టపడేవాడు. అయితే అది కాస్ట్లీ గేమ్ కావడంతో దానిని వదిలేసి అథ్లెటిక్స్ లో రాణించాడు. అతని కోచ్ రషీద్ అహ్మద్ సాకీ నదీమ్ లోఉన్న నైపుణ్యాన్ని గుర్తించాడు. దీంతో అంతా తానే అయి నదీమ్ ను జావెలెన్ త్రోలో శిక్షణ అందించాడు. జావెలెన్ త్రో కంటే ముందు నదీమ్ షాట్‌పుట్, డిస్కస్ త్రో వంటి వాటిల్లో ఆరితేరాడు. నదీమ్ జావెలెన్ త్రోను 2015లో ప్రారంభించాడు. అప్పటి నుంచి దేశీయంగా జరిగే వివిధ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాడు. పాకిస్థాన్ క్రీడా శాఖ అతనికి కనీసం స్కాలర్ షిప్ కూడా ఇవ్వలేదు.
పట్టుబట్టి...
అయినా పట్టుబట్టి మరీ జావెలెన్ త్రోలో పట్టు సంపాదించాడు. పారిస్ ఒలింపిక్స్ లో రికార్డు సృష్టించాడు. ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన నదీమ్ జావెలెన్ ను 92.97 మీటర్ల దూరంలో విసిరేశాడు. స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇలా నదీమ్ కష్టాల నుంచి ఎదిగి.. దాని నుంచే తన జీవితాన్ని మలుచుకున్నాడు. నదీమ్ లాంటి ఆటగాళ్లకు పాకిస్థాన్ లో పెద్దగా ప్రోత్సాహం లేకపోయినా రాణించి ఆ దేశానికి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడంటే.. నదీమ్ ను మెచ్చుకోకుండా ఉండలేం.