పాక్ క్రికెటర్ కు తీవ్రగాయం.. వీరంతా జట్టు నుండి అవుట్

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని

Update: 2023-09-12 08:39 GMT

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్‌ ఆఘా సల్మాన్‌ గాయపడ్డాడు. భారీ ఛేజింగ్ లో పాకిస్తాన్‌ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆఘా సల్మాన్‌ పాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్ తీసి ఆడాలని సల్మాన్‌ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పాక్‌ ఇన్నింగ్స్‌ 21 ఓవర్‌ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సల్మాన్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని అతడి ముఖానికి బలంగా తాకింది. కంటి కింద గాయం కాగా.. రక్తం కూడా వచ్చింది. దీంతో మైదానంలోనే సల్మాన్‌ నొప్పితో విలవిల్లాడాడు. భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అతడు వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి కంకషన్‌ టెస్టు చేశాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక పాక్ జట్టుకు మరో పెద్ద షాక్ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ పేస్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, నసీమ్ షాలు ఆసియాకప్ కు దూరమయ్యారు. వీరి స్థానంలో యువ పేసర్లు షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చారు. పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో స్పందిస్తూ... రవూఫ్, నసీమ్ షా ఇద్దరూ తమ మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారని తెలిపింది. వారి గాయాలు అంత తీవ్రమైనవి కావని, ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని వారికి రెస్ట్ కల్పించామని చెప్పింది. ఆసియా కప్ లో వారిని ఆడించి రిస్క్ తీసుకోలేమని తెలిపింది. ఇక సెప్టెంబర్ 14న శ్రీలంక తదుపరి మ్యాచ్ ఆడనుంది.


Tags:    

Similar News