ఏజ్ ఫ్రాడ్.. బ్యాడ్మింటన్ అసోసియేషన్ లో ఊహించని మోసాలు

బ్యాడ్మింటన్ ప్లేయర్లు కొత్త రకం మోసానికి తెరలేపారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ మోసానికి పాల్పడ్డారు

Update: 2023-08-02 07:05 GMT

బ్యాడ్మింటన్ ప్లేయర్లు కొత్త రకం మోసానికి తెరలేపారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ మోసానికి పాల్పడ్డారు. క్రీడాకారులు తమ అసలు వయస్సును తగ్గించి బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ సర్టిఫికెట్లతో వారి కంటే పిన్న వయస్కులతో పోటీ పడ్డారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బ్యాడ్మింటన్ ప్లేయర్ల వయసుకు సంబంధించిన సమాచారాన్ని సీసీఎస్ పోలీసులకు ఓ వ్యక్తి ఈ ఏడాది మార్చి 29వ తేదీన లేఖ రాశాడు. లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలు చేశాడు. ఆరుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్లు, తమ అసలు వయస్సును దాచిపెట్టి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను బీఏఐకి సమర్పించారని అన్నారు. తమ కంటే చిన్న వారితో పోటీల్లో పాల్గొంటూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపాడు. దాదాపు 40 మంది బ్యాడ్మింటన్‌ ప్లేయర్ల వయస్సుపై సందేహాలను వ్యక్తం చేశాడు ఆ అజ్ఞాత వ్యక్తి . ఈ ప్లేయర్లంతా 2005–10 మధ్య పుట్టారని కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లకు బదులు కొందరు డాక్టర్లు ఇచ్చిన ఫేక్ మెడికల్‌ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అనేక మంది కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులు, డాక్టర్లు ఈ స్కామ్ లో ఉన్నారని ఆ లేఖలో ప్రస్తావించాడు.
సిటీ సీసీఎస్ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని.. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌ నేతృత్వంలో స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ముగ్గురు ప్లేయర్లకు సంబంధించిన ఆధారాలు ఈ అధికారులు కనుగొన్నారు. బీఏఐ జాబితాలో అండర్‌–17లో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్‌ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించాడు. పలు టోర్నీల్లో ఆడాడు. రోహన్‌ 2005 అక్టోబర్‌ 29 తేదీన పుట్టాడని పోలీసులు నిర్ధారించారు. అండర్ –17లో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్‌ మౌనీష్‌ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నాడు. కానీ అతను 2006 జూన్‌4న పుట్టాడని గుర్తించారు. అండర్‌–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్‌ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్‌ 12గా పేర్కొన్నాడు. కానీ అతని నిజమైన పుట్టిన తేదీ 2007 జనవరి 12 అని తేలింది. ఇంకా ఈ లిస్టులో చాలా మంది బయటకు రావాల్సి ఉంది. వీరిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ కు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News