IPL 2025 : చెన్నైకు మళ్లీ తప్పని ఓటమి..కేకేఆర్ దే విజయం

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి పరాజయం పాలయింది.;

Update: 2025-04-12 01:46 GMT
chennai super kings,  kolkata knight riders, IPL 2025, chennai
  • whatsapp icon

ఒకప్పుడు ఐపీఎల్ లో ఒక ఊపు ఊపిన చెన్నై సూపర్ కింగ్స్ నేడు తేలిపోతుంది. ఛాంపియన్స్ గా నిలిచి ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న జట్టుకు కాలం కలసి రావడం లేదు. జట్టులో ఉద్దండులున్నా ప్రయోజనం లేదు. ఎన్ని మ్యాచ్ లు ఆడినా.. ఎన్ని వేదికలు మారినా.. ఎన్ని జట్లతోనైనా చివరకు ఓటమితో వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఫామ్ లో లేక చెన్నై ఆటగాళ్లు చతికిలపడుతున్నారు. బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపించలేక మెప్పించలేకపోతున్నారు. ఫలితంగా వరసగా ఐదో ఓటమిని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూడాల్సి వచ్చింది. నిన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి పరాజయం పాలయింది.

సొంతగడ్డపైన కూడా...
సొంతగడ్డ చెన్నై కూడా అచ్చిరావడం లేదు. లక్షలాది మంది అభిమానులు మద్దతున్నా ఆటగాళ్లు మాత్రం తేలిపోతున్నారు.చెన్నై ఘోర పరాజయాలకు కారణాలపై ఆ జట్టు తమకు తామే పరిశీలించుకోవాల్సి ఉంది. ఈసారి అస్సలు సెమీ ఫైనల్స్ కు కూడా చేరుతుందన్న నమ్మకం కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేదు. రచిన్ రవీంద్ర, కాన్వే, రాహుల్ త్రిపాఠిలు పరుగులు పెద్దగా చేయకుండానే అవుటయ్యారు. విజయ్ శంకర్ 29, శివమ్ దూబేలు 31 పరుగుల చేసి పరవాలేదనిపించుకున్నా, తర్వాత అందరూ అవుట్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లకు తొమ్మిది వికెట్లను కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అతి తక్కువ స్కోరుకు...
ఐపీఎల్ లో ఇది అతి తక్కువ స్కోరు. చెన్నై ఇంత దారుణంగా విజయాన్ని అంత సులువుగా కోల్ కత్తాకు అప్పగిస్తుందని ఎవరూ ఊహించలేదు. పోరాడి ఓడినా సరిపెట్టుకోవచ్చు. కానీ ముందు నుంచి తేలిపోతున్న జట్టును చూసి ఏమనాలో అర్థం కావడం లేదు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని అతి తేలిగ్గా చేరుకోగలిగింది. డికాక్ 23 పరుగులు, సునీల్ నరైన్ 44, రాహేనే 20, రింకూ సింగ్ 15 పరుగులు చేసి జట్టును గెలిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో చేసిన స్కోరును కోల్ కత్తానైట్ రైడర్స్ కేవలం 10.1 ఓవర్లలోనే ముగించేసింది. రెండు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి కోల్ కత్తా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది.







Tags:    

Similar News