డిఫెండింగ్ ఛాంపియన్ కు చుక్కలు చూపించిన కివీస్
డిఫెండింగ్ ఛాంపియన్స్.. ఛాన్స్ దొరికితే ప్రతి మ్యాచ్ లోనూ 400 కొట్టగలరు ఇంగ్లండ్ ఆటగాళ్లు
డిఫెండింగ్ ఛాంపియన్స్.. ఛాన్స్ దొరికితే ప్రతి మ్యాచ్ లోనూ 400 కొట్టగలరు ఇంగ్లండ్ ఆటగాళ్లు. 2023 ఐసీసీ మెన్స్ ప్రపంచ కప్ ను ఘనంగా ఆరంభించాలని ఇంగ్లండ్ అనుకోగా.. న్యూజిలాండ్ జట్టు ఆ ఆశలను అడియాశలు చేసింది. పూర్తిగా వన్ సైడ్ మ్యాచ్ చేసేసింది కివీస్. ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేయగా, న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్ డౌన్ బ్యాట్స్ మన్ రచిన్ రవీంద్ర సెంచరీలతో దుమ్ము దులిపారు. ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ అయినా, న్యూజిలాండ్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ జోడీ విజృంభణతో న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది. కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో జో రూట్ చేసిన 77 పరుగులే అత్యధికం. కెప్టెన్ జోస్ బట్లర్ 43 పరుగులు సాధించాడు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 33, యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 25, లియామ్ లివింగ్ స్టోన్ 20 పరుగులు చేశాడు. ఓపెనర్ డేవిడ్ మలాన్ (14), మొయిన్ అలీ (11), శామ్ కరన్ (14) విఫలమయ్యారు. అదిల్ రషీద్ 15, మార్క్ ఉడ్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 3 వికెట్లు తీయగా, మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు.