పాపం.. హనుమ విహారి వెనుక ఇన్ని రాజకీయాలు జరిగాయా?

భారత జట్టు క్రికెట‌ర్, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హ‌నుమా విహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు

Update: 2024-02-26 14:16 GMT

భారత జట్టు క్రికెట‌ర్, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హ‌నుమా విహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేష‌న్ తీరు త‌న‌ను ఎంతో వేధ‌న‌కు గురి చేసింద‌ని, త‌న ఆత్మ గౌర‌వాన్ని దెబ్బ తీసింద‌ని విహ‌రి ఆరోపించాడు. ఇకపై ఆంధ్రా క్రికెట్ జ‌ట్టుకు ఆడే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పాడు. హనుమ విహారి గత నెలలో ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ వదులుకోగా.. బ్యాటింగ్ పై దృష్టి సారించేందుకే విహారి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాను కెప్టెన్సీ వదులుకోవడానికి దారితీసిన పరిస్థితులను హనుమ విహారి తాజాగా వివరించాడు. ఈ రంజీ సీజన్ లో ఆంధ్రా జట్టు బెంగాల్ టీమ్ తో ఆడినప్పుడు నేను కెప్టెన్ గా ఉన్నాను. ఆ సమయంలో ఆంధ్రా రంజీ టీమ్ లోని 17వ ఆటగాడిపై కోపంతో అరిచాను. దాంతో ఆ ఆటగాడు తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆ క్రికెటర్ తండ్రి ఒక రాజకీయ నాయకుడు. నాపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన క్రికెట్ సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ మ్యాచ్ లో బెంగాల్ పై 410 పరుగులు ఛేదించి నెగ్గాం. బెంగాల్ జట్టు గతేడాది రంజీ ఫైనలిస్టు. అటువంటి జట్టుపై నెగ్గినప్పటికీ, కెప్టెన్ గా నన్ను రాజీనామా చేయాలని చెప్పారు. నా తప్పేమీ లేకపోయినా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్నారు. నాకంటే ఆ ఆటగాడే ముఖ్యమని క్రికెట్ అసోషియేషన్ భావించింది. గతేడాది తన శరీరానికి తగిలిన దెబ్బను కూడా లెక్కచేయకుండా ఒక్కచేత్తో బ్యాటింగ్ చేసిన ఆటగాడి కంటే, గత ఏడేళ్లలో ఆంధ్రా జట్టును ఐదు సార్లు నాకౌట్ కు చేర్చిన ఆటగాడి కంటే క్రికెట్ సంఘానికి ఆ ఆటగాడే ముఖ్యం అయ్యాడు. అయినప్పటికీ ఈ సీజన్ లో ఆడుతున్నానంటే అందుకు కారణం... క్రికెట్ పై నాకున్న గౌరవం, నా జట్టుపై నాకున్న గౌరవం. తాము ఏం చెబితే క్రికెటర్లు అది వినాలని, తమ వల్లే క్రికెటర్లు జట్టుకు ఎంపికై ఆడుతున్నారని క్రికెట్ అసోసియేషన్ భావిస్తుండడం విచారకరం. ఈ ఘటనపై నాలో నేనే బాధపడ్డాను కానీ ఇప్పటిదాకా బయటికి చెప్పుకోలేదు. ఇక ఎప్పటికీ ఆంధ్రా టీమ్ కు ఆడరాదని నిర్ణయించుకున్నాను. నాకు గౌరవం లేని చోట నేను ఉండలేను. ప్రతి సీజన్ కు మేం ఎంతో మెరుగవుతూ వస్తున్నాం.. కానీ మేం ఎదగడమే క్రికెట్ అసోసియేషన్ కు ఇష్టం లేనట్టుందని హనుమ విహారి తెలిపాడు.


Tags:    

Similar News