తొలి మ్యాచ్‌లో నెగ్గిన భార‌త్‌

వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

Update: 2023-10-09 01:38 GMT

వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులు చేసింది. అనంత‌రం ఛేద‌న‌కు దిగిన‌ భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. త‌ద్వారా టీమిండియాకు ప్రపంచ కప్‌లో విజయవంతమైన ప్రారంభం ల‌భించిన‌ట్లైంది.

ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి హీరోలు లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ. అయితే వీరిద్దరూ సెంచరీలు చేసే అవ‌కాశాన్ని మిస్సయ్యారు. రాహుల్ 97 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. కోహ్లీ 85 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా(11) నాటౌట్‌గా మిగిలాడు. ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్ మూడు వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీశారు.

ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌లో అత్యధికంగా 46 పరుగులు చేశాడు. వార్నర్ కూడా 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్టార్క్ 28 పరుగులు చేశాడు. భారత్ తరఫున రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, హార్దిక్, అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ రెండు కీలక పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా ఐదో స్థానానికి చేరుకుంది. భారత్ తదుపరి మ్యాచ్ అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనుంది.


Tags:    

Similar News