నేడు నేపాల్ తో తలపడనున్న టీమిండియా.. వర్షంతో ఇది కూడా రద్దయితే?
భారత క్రికెట్ అభిమానులకు వరుణుడు నిద్ర లేకుండా చేస్తున్నాడు
భారత క్రికెట్ అభిమానులకు వరుణుడు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్‌తో మ్యాచు వర్షం కారణంగా తుడిచిట్టుకుపోగా.. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 4న నేపాల్‌తో టీమిండియా మ్యాచుకు కూడా వర్షం అడ్డంకిగా మారనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ జరిగిన పల్లెకెలె లోని క్యాండీ లోనే భారత్-నేపాల్ మ్యాచు కూడా జరగనుంది. ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సోమవారం పల్లెకెల్లెలో 80 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమయంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. ఒక వేళ మ్యాచు రద్దు అయితే భారత్-నేపాల్ జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉ్ననాయి. ఇప్పటికే తొలి మ్యాచులో పాకిస్థాన్ గెలిచి రెండు పాయింట్లు సాధించింది. భారత్ తో రెండో మ్యాచు రద్దు అవ్వడంతో మరో పాయింట్ లభించింది. మొత్తంగా మూడు పాయింట్లతో పాకిస్థాన్ గ్రూప్-4 దశకు అర్హత సాధించింది. భారత్ విషయానికి వస్తే పాక్‌తో మ్యాచు రద్దు కావడంతో ఒక పాయింట్ సాధించింది భారత్. నేపాల్‌తో మ్యాచు సైతం సజావుగా జరగపోతే మరో పాయింట్ వస్తుంది. దీంతో మొత్తంగా రెండు పాయింట్లతో భారత్ కూడా గ్రూప్-4 దశకు గ్రూప్-ఏలో రెండో స్థానంతో వెళ్లనుంది. లీగ్ దశలో ఒక్క మ్యాచు కూడా పూర్తిగా ఆడకుండా, గెలవకుండానే టీమిండియా గ్రూప్-4కు చేరుతుంది. నేపాల్ ఇంటి బాట పడుతుంది.