భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్ లో థాయ్ లాండ్ ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ కు చేరుకుంది. సమష్టిగా రాణించిన భారత మహిళలు శనివారం నాడు ఫైనల్ లో తలపడనున్నారు. పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ లో విజేతతో భారత్ తలపడనుంది.
థాయ్ లాండ్ తో గురువారం మొదలైన సెమీఫైనల్లో భారత్ 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఓపెనర్ స్మృతి మంధాన (13) నిరాశ పరిచినా.. జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 3 ఫోర్లతో 27), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 4 ఫోర్లతో 36) రాణించారు. రిచా ఘోష్ (2), దీప్తి శర్మ (3) ఫెయిలైనా.. చివర్లో పూజా వస్త్రాకర్ (13 బంతుల్లో 1 సిక్స్ తో 17 నాటౌట్) రాణించింది. థాయ్ లాండ్ బౌలర్లలో సిర్నారిన్ తిపోచ్ (3/24) మూడు వికెట్లతో రాణించింది.
ఇక ఛేజింగ్ లో ఎక్కడా కూడా థాయ్ లాండ్ అనుకున్నట్లుగా ముందుకు సాగలేదు. 20 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసి 9 వికెట్లను కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత మహిళలు 74 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు. థాయ్ లాండ్ ఇన్నింగ్స్ లో నట్టాయ బూచాతం, నారూమోయ్ 21 పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మకు 3, రాజేశ్వరి 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడతాయి.