థామస్ కప్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్

డెన్మార్క్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్‌ ఓటమితో మొదలుపెట్టింది. భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌..

Update: 2022-05-14 03:54 GMT

థామస్ కప్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ కు చేరడం ద్వారా సరికొత్త శకానికి ఆరంభం పలికారు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు. బ్యాంకాక్‌లో జరుగుతున్న థామస్ ఉబెర్ కప్‌లో భారత మెన్స్ టీం 73ఏళ్ల చరిత్రగల ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో డెన్మార్క్‌తో హోరా హోరీగా మ్యాచ్ జరగగా.. టీమిండియా 3-2తో గెలిచింది. ఆదివారం ఫైనల్ జరగనుంది. ఫైనల్లో 14సార్లు థామస్ కప్ ఛాంపియన్‌గా పేరున్న ఇండోనేసియా టీంతో టీమిండియా తలపడనుంది. సెమీఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

డెన్మార్క్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్‌ ఓటమితో మొదలుపెట్టింది. భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 13–21, 13–21తో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–18, 21–23, 22–20తో కిమ్‌ ఆస్‌ట్రప్‌–మథియాస్‌ క్రిస్టియాన్సన్‌ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21–18, 12–21, 21–15తో గెలుపొంది భారత్‌కు 2–1 ఆధిక్యాన్ని అందించాడు. నాలుగో మ్యాచ్‌లో డెన్మార్క్‌ జట్టు రాణించింది. ఆండెర్స్‌ రస్‌ముసెన్‌–ఫ్రెడెరిక్‌ ద్వయం 21–14, 21–13తో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జంటను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది. స్కోరు 2–2తో సమం కావడంతో ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై ఉండగా.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మలేసియాతో క్వార్టర్‌ ఫైనల్లో చివరి మ్యాచ్‌లో గెలిచి భారత్‌ను సెమీస్‌కు చేర్చిన ప్రణయ్‌ సెమీస్ లోనూ అదే మ్యాజిక్ చేశాడు. ప్రపంచ 13వ ర్యాంకర్‌ రస్‌ముస్‌ జెమ్కెతో జరిగిన మ్యాచ్‌లో 23వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 13–21, 21–9, 21–12తో గెలుపొంది భారత్‌ను తొలిసారి థామస్‌ కప్‌లో ఫైనల్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్ 73 నిమిషాల పాటూ సాగింది.
1949నుంచి ఈ టోర్నీ జరుగుతుండగా భారత్ 73ఏళ్ల చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది. ఫైనల్లో ఇండోనేషియా టీంతో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో 14సార్లు గెలిచిన ఇండోనేషియా టైటిల్ ఫేవరెట్ అయినప్పటికీ.. టీమిండియాను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని అంటున్నారు క్రీడా పండితులు.


Tags:    

Similar News