IPL 2024 Auction : కోట్లు కుమ్మరించడానికి రెడీ.. ఆల్ రౌండర్లకే ప్రయారిటీ
ఐపీఎల్ 2024 ఆటగాళ్ల వేలానికి సమయం దగ్గర పడుతుంది. 333 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది
క్రికెట్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. కొన్ని నెలల పాటు మరో క్రికెట్ సమరం త్వరలోనే ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం వేలం ప్రారంభం కానుంది. ఈ నెల 19వ తేదీన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. ఫ్రాంచైజెస్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఫ్రాంచైజీలు వీరిలో ఎవరిని కొనుగోలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరు అత్యధిక ధరకు అమ్ముడవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
కన్నుల పండగగా...
ఐపీఎల్ అంటే అందరికీ ఇష్టం. 20 ఓవర్ల ఆట కావడం... అందరు ప్లేయర్లను ఒక జట్టులో చూడటం.. సొగసైన షాట్లు... అబ్బురపర్చే క్యాచ్‌లు... అద్భుతమైన రన్ అవుట్లు.... ఆకాశం అంచున తాకే సిక్సర్లు.. బౌండరీలకు పరుగులు తీసే బంతులు... బాల్ వెళ్లి వికెట్ ను తీసుకెళ్లడం ఇలా ఒక్కటేమిటి... ప్రతి ఒక్క కదలిక.. కళ్లకు కట్టిపడేస్తాయి. స్టేడియానికి వెళ్లకపోయినా ఇంట్లో కూర్చుని మ్యాచ్ ను ఆస్వాదించే కోట్లాది అభిమానుల మనస్సులను కొల్లగొట్టే ఐపీఎల్ కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.
వారం రోజుల్లో...
ఈ నెల 19వ తేదీన జరగబోయే ఆటగాళ్ల వేలానికి అంతా రెడీ చేవారు. ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల జాబితాను అందించారు. మొత్తం 333 మంది ప్లేయర్లలో 214 మంది ఇండియన్స్. 119 మంది ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు. వేలంలో ఫ్రాంచైజీల వద్ద ఉన్న సొమ్ము మొత్తం 262.95 కోట్ల రూపాయలు. గరిష్టంగా 30 మంది విదేశీ ఆటగాళ్లను ఫ్రాంచైజీలను కొనుగోలు చేసే అవకాశముంది. కోట్లు ధరలు పలికే ఆటగాళ్లను కొనుగోలు చేయడమే కాకుండా ఆల్ రౌండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆల్ రౌండర్లు ఉంటేనే ఐపీఎల్ కప్పు దొరకబుచ్చుకోవడం సాధ్యమవుతుందన్న అంచనాతో ఎక్కువ సొమ్ము వెచ్చించైనా ఆల్ రౌండర్ ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీస్ పోటీ పడతాయి. చూద్దాం... ఈసారి ఎవరు అత్యంత ధర పలుకుతారో... మరో వారం వెయిట్ చేస్తే చాలు.. తెలిసిపోతుంది.