కోచ్‌ను మార్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. విజ‌యాల బాట ప‌ట్టేనా..?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ తదుపరి సీజన్‌కు న్యూజిలాండ్ వెటరన్ డేనియల్ వెట్టోరీని ప్రధాన కోచ్‌గా నియమించింది.

Update: 2023-08-07 12:42 GMT

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ తదుపరి సీజన్‌కు న్యూజిలాండ్ వెటరన్ డేనియల్ వెట్టోరీని ప్రధాన కోచ్‌గా నియమించింది. వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియాన్‌ లారా నుంచి వెట్టోరీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. గత సీజన్‌లో జట్టు పేలవ ప్రదర్శనతో లారాను కోచ్‌గా తొలగించారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి గ‌తంలో వెట్టోరీ కెప్టెన్‌గా ఉన్నాడు. వెట్టోరి 2014, 2018 వరకు ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా కూడా సేవ‌లందించాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ ప్రధాన కోచ్‌గా టామ్ మూడీ ఉన్నాడు. హైదరాబాద్ జట్టు చివరిసారిగా 2020లో ఐపీఎల్ ప్లేఆఫ్‌కు చేరుకుంది.

వెట్టోరి ప్రస్తుతం 'ది హండ్రెడ్'లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ పురుషుల జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. గతంలో బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ సలహాదారుగా కూడా ఉన్నాడు. ఐపీఎల్‌లో కోచ్‌గా వెట్టోరి ఆర్సీబీని 2015లో ప్లేఆఫ్‌కు, 2016లో ఫైనల్‌కు చేరుకోవడంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే.. వెట్టోరి కోచ్‌గా ఉన్న ఆర్సీబీ జట్టు.. 2016 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద‌ ఓడిపోవ‌డం విశేషం.

2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. కోచ్‌ను మార్చిన మూడవ ఫ్రాంచైజీగా నిలిచింది. ఆండీ ఫ్లవర్ స్థానంలో జస్టిన్ లాంగర్‌ను కోచ్‌గా లక్నో సూపర్‌జెయింట్స్ నియమించింది. సంజయ్ బంగర్ స్థానంలో ఆండీ ఫ్లవర్‌కు ప్రధాన కోచ్ బాధ్యతలను ఆర్సీబీ అప్పగించింది. ఇప్పుడు సన్‌రైజర్స్ బ్రియాన్ లారా స్థానంలో డేనియల్ వెటోరీని కోచ్‌గా నియమించింది.

సన్‌రైజర్స్ జట్టు 2020 వరకూ ప్రతిసారీ ప్లేఆఫ్‌లకు చేరుకుంది, కానీ ఆ తర్వాత ఆ విజయాల‌ను పునరావృతం చేయడంలో విఫలమైంది. వెట్టోరి శిక్ష‌ణ‌లో ఫ్రాంచైజీ మళ్లీ మొదటి నాలుగు స్థానాల్లోకి రావాలని ఆశిస్తోంది. వెట్టోరికి కెప్టెన్‌ ఐడెన్ మార్క్రామ్ నుంచి మంచి స‌హ‌కారం ఉంటే విజ‌యాలు న‌మోదు చేయ‌డం పెద్ద విష‌య‌మేం కాదంటున్నారు అభిమానులు.


Tags:    

Similar News