టీమిండియా మాజీ సారథి, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కరచాలనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం తమిళనాడు పర్యటనకు వెళ్లిన అమిత్ షా ఇండియా సిమెంట్స్ వజ్రోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ గతంలో బీసీసీఐ చైర్మన్ గా పనిచేయడమే కాకుండా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని కూడా ఆయనే..! సీఎస్కేకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఇండియా సిమెంట్స్ వజ్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అమిత్ షాతో ధోనీ కరచాలనం చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అమిత్ షాతో కలిసిన ధోనీ త్వరలోనే బీజేపీలో చేరనున్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. సీఎస్కే యాజమాన్యం కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి ఆ జట్టు కెప్టెన్ హోదాలోనే ధోనీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, అదే కార్యక్రమానికి వచ్చిన అమిత్ షాను ఆయన మర్యాదపూర్వకంగానే కలిశారని, ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని అంటున్నారు. మహేంద్ర సింగ్ ధోని భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందంటూ గతంలో కూడా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే..!