IPL 2025 : ముంబయి మెరిసింది.. కోల్ కత్తా తడబడింది
కోల్ కత్తానైట్ రైడర్స్ ను ముంబయి ఇండియన్స్ ఓడించింది. ఐపీఎల్ లో తొలి విజయం సాధించింది;

హమ్యయ్య...ఎన్నాళ్లకు ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ తన సొంత మైదానంలో సత్తా చాటింది. ఇప్పటి వరకూ వరసగా ఓటములను చవి చూసిన ముంబయి ఇండియన్స్ కు తొలి విజయం దక్కింది. బౌలర్లు,బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతోనే ముంబయి విజయం ఖాయమయింది. కొత్త కుర్రోళ్లు ముంబయిని గెలిపించారనుకోవాలి. అశ్వినీ కుమార్ తన తొలి మ్యాచ్ లోనే కోల్ కత్తా నైట్ రైడర్స్ వెన్ను విరిచాడు.మిగిలిన ముంబయి బౌలర్లు అతనికి తోడు కావడంతో తక్కువ పరుగులకే కోల్ కత్తాను ఓడించగలిగింది. ఛాంపియన్ గా నిలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో ఓటములతో ఆరంభం చేసింది. మరో ఓటమితో వరసగా రెండు ఓటములను చవి చూడాల్సి వచ్చింది.
విఫలమయి...
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తానైట్ రైడర్స్ ను ముంబయి ఇండియన్స్ బౌలర్లు కోలుకోలేని దెబ్బతీశారు. కొత్త బౌలర్ అశ్వనికుమార్ నాలుగు వికెట్లు తీయడంతో ముంబయి విజయం ముందే ఖాయమయింది. ఎంతగా అంటే కోల్ కత్తా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలోనే 116 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఐపీఎల్ లో ఇది అతి తక్కువ స్కోరు అని చెప్పాలి. ఇందులో రఘువంశీ ఒక్కడే ఇరవై ఆరు పరగుులు చేశాడు. మిగిలిన బ్యాటర్లంతా వరసగా పెవిలియన్ దారి పపట్టడంతో ముంబయికి తక్కువ టార్గెట్ లభించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు చెందిన బౌలర్లు ఎవరూ కాసేపు కూడా క్రీజులో నిలబడలేకపోవడం ముంబయికి కలసి వచ్చింది.
రెండు వికెట్లు కోల్పోయి...
ముంబయి బౌలర్లలో దీపక్ చాహర్ రెండు, అశ్వినీ కుమార్ నాలుగు, హఆర్థిక్ ఒకటి, విష్నేశ్ ఒకటి, శాంటర్న్ ఒక వికెట్ తీయడంతో కోల్ కత్తా కథముగిసినట్లయింది. ఇక తర్వాత బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఏమాత్రం వెను దిరిగి చూసుకోలేదు. తక్కువ టార్గెట్ కావడంతో ఇక కోల్ కత్తా పనిపట్టారు. రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుటయినా ర్యాన్ రికిల్టన్ నిలబడి నాటౌట్ గా నిలిచి 62 పరుగులు చేశాడు. విల్ జాక్స్ పదహారు, సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఏడు పరుగులు చేయగలిగారు. దీంతో మొత్తం 12.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు సాధించి కోల్ కత్తాపై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ అన్ని విభాగాల్లో విఫలం కావడం ముంబయికి కలసి వచ్చింది. ఎనిమిది వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ భారీ విజయాన్ని దక్కించుకుంది.