IPL 2025 : సన్ రైజర్స్ ను చావు దెబ్బతీసిన కోల్ కత్తా నైట్ రైడర్స్
కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్ కత్తా నైట్ రైడర్స్ పై ఓటమి పాలయింది;

గత ఐపీఎల్ సీజన్ లో మెరుపులు మెరిపించిన జట్లు ఈ సీజన్ లో మాత్రం ఆరంభంలో తడబడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత సీజన్ లో ఫైనల్స్ కు చేరుకుంది. కానీ ఈ సీజన్ లో ఇప్పటికే మూడు ఓటములను చవి చూసింది. నాలుగు మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో చివరి చోటు సంపాదించుకుంది. నిన్న కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్ కత్తా నైట్ రైడర్స్ పై ఓటమి పాలయింది. నైట్ రైడర్స్ లో వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ బ్యాట్ తో ఝుళిపించగా, తమ బంతితోవరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా తిప్పేసి సన్ రైజర్స్ ను ఓటమి పాలయ్యేలా చేయగలిగారు.దీంతో సన్ రైజర్స్ కు వరసగా మూడో ఓటమి మూట గట్టుకున్నట్లయింది.
ఓపెనర్లు అవుటయినా...
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఓపెనర్లను సన్ రైజర్స్ సులువుగానే పంపగలిగింది. డికాక్ ఒక పరుగుకు అవుట్ కాగా, నరేన్ ఏడు పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత రహానె నిలకడగా ఆడుతూ 38 పరుగులు చేశాడు. అదరిపోయే సిక్సర్లు, ఫోర్లు మలచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒక దశలో రన్ రేట్ ఆరు కూడా లేనిది రహానే వచ్చిన తర్వాత పది వరకూ చేరుకుంది. ఇక రఘవువంశీ హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటగలిగాడు. వెంకటేశ్ అయ్యర్ అరవై పరుగులు చేయడంతో పాటుగా అతనికి తోడు రింకూ సింగ్ 32 పరుగులు తోడవ్వడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి మంచి లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ఉంచగలిగింది.
లక్ష్యం పెద్దదయినా...
అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ను త్వరత్వరగా అవుట్ చేయడంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్స్ సక్సెస్ అయ్యారు. ట్రావిస్ హెడ్ నాలుగు పరుగులకే అవుట్ కాగా, అభిషేక్ శర్మరెండు పరుగులకే వెనుదిరిగడు. ఇషాన్ కిషాన్ రెండు పరుగులు చేసి నిరాశపర్చి అవుటయి వెనుదిరిగాడు. నితీశ్ కుమార్ రెడ్డి పందొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగాడు. మెండిస్ 27 పరుగులు, క్లాసెన్ 33 పరుగులు చేసి పరవాలేదని అనిపిచంినా అప్పటికే ఓవర్లు తక్కువ లక్ష్యం అధికంగా మారింది. వారు కూడా అవుట్ కావడంతో ఇక బౌలర్లపై భారం పడింది. కానీ వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. చివరకు 16.4 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి 120 పరుగుల చేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా మూడు, హర్షిత్ రాణా ఒకటి, వరుణ్ చక్రవర్తి మూడు , రసెల్ రెడు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కట్టడి చేయగలిగారు.