రోహిత్ సూపర్ ఇన్నింగ్స్.. నాగ్ పూర్ లో భారత్ దే విజయం..!
ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ ఎక్కడా రన్ రేట్ తగ్గనివ్వకుండా ముందుకు నడిపించాడు.
నాగ్ పూర్ లో భారత్ కు విజయాన్ని నాయకుడు రోహిత్ శర్మ అందించాడు. చాలా ఆలస్యంగా మొదలైన మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్ లో భారత్ ముందు ఆస్ట్రేలియా భారీ స్కోరును ఉంచగా.. రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ కు తోడు.. ఆఖర్లో దినేష్ కార్తీక్ ఫినిషింగ్ చేయడంతో భారత్ నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ ఇన్నింగ్స్ ను 1-1 తో ముగించింది. నిర్ణయాత్మక మూడో టీ-20 మ్యాచ్ ఈ ఆదివారం హైదరాబాద్ లో జరగనుంది.
ఈ మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించగా, టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మాథ్యూ వేడ్ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి దూకుడుగా ఆడాడు. వేడ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 31 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 5, మ్యాక్స్ వెల్ 0, టిమ్ డేవిడ్ 2, స్టీవ్ స్మిత్ 8 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.
ఛేజింగ్ లో భారత్ మొదటి ఓవర్లో మూడు సిక్సర్లు వచ్చాయి. రోహిత్ శర్మ మొదటి ఓవర్లో రెండు సిక్సర్లు బాదగా.. రాహుల్ కూడా మరో సిక్సర్ ను కొట్టడంతో భారత్ ఇన్నింగ్స్ మంచిగా టేకాఫ్ అయింది. ఆ తర్వాత ఓ వైపు వికెట్లు పడుతూ ఉన్నా.. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ ఎక్కడా రన్ రేట్ తగ్గనివ్వకుండా ముందుకు నడిపించాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీసి భారత శిబిరాన్ని కాస్త టెన్షన్ పెట్టాడు. ఆఖరి ఓవర్లో దినేష్ కార్తీక్ రెండు బంతుల్లో 10 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 20 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, నాలుగు సిక్సర్లు రోహిత్ ఇన్నింగ్స్ లో ఉన్నాయి. రాహుల్ 6 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ రెండు మంచి షాట్స్ ఆడి జంపా బౌలింగ్ లో 11 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా వెనుదిరిగాడు. పాండ్యా 9 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 7.2 బంతుల్లో లక్ష్యాన్ని చేరుకున్న భారత్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.