భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు ఎలా ఉన్నారని తెలుసుకోడానికి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఏదైనా చిన్న ఘటన జరిగినా అదొక పెద్ద వార్తలా మారిపోతూ ఉంటుంది. పాకిస్థాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్ శుక్రవారం నాడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నెట్ సెషన్‌లో తలకు దెబ్బ తగలడంతో కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని స్కాన్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్పిన్నర్ బౌలింగ్ లో మహ్మద్ నవాజ్ లాఫ్టెడ్ షాట్ కొట్టగా.. అది కాస్తా మసూద్ తలకు తగిలింది. 33 ఏళ్ల షాన్ మసూద్ ఆ సమయంలో ప్యాడ్‌లు ధరించి ఉన్నాడు కానీ హెల్మెట్ ధరించలేదు. అతను బ్యాటింగ్ చేయడానికి తన వంతు కోసం వేచి ఉన్నాడు. మసూద్ నేలమీద పడి బాధతో విలవిల్లాడాడు. దీంతో అతన్ని వెంటనే డాక్టర్ ముందు హాజరుపరిచారు.
సెన్సిటివ్ ఏరియాలో భారీ షాట్ తగిలిందని వైద్యులు తెలిపారు. "అతని ప్రస్తుత స్థితి నాకు తెలియదు, కానీ అతను మా ఫిజియో చేసిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. స్కాన్ కోసం ఆసుపత్రికి వెళ్ళాడు. అతను త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము, "అని పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ చెప్పాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో తన T20I అరంగేట్రం చేసిన మసూద్, మొత్తం ఏడు T20Iలు ఆడాడు. రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అయితే ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆదివారం భారత్‌తో తలపడనుంది.