రిటైర్మెంట్ అంటూ షాకిచ్చిన మరో స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ అక్టోబర్ 5 - నవంబర్ 19 మధ్య భారతదేశంలో జరగనున్న ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశాడు. ప్రపంచ కప్ తర్వాత 50 ఓవర్ల ఆట నుండి తప్పుకుంటానని ధృవీకరించాడు. 30 ఏళ్ల డికాక్ 2013లో వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. 140 మ్యాచ్‌లలో ఆడాడు.. 17 మ్యాచ్ లలో సెంచరీలు, 29 అర్ధ సెంచరీలతో 44.85 సగటుతో 5966 ODI పరుగులు చేశాడు. డి కాక్ ఈ ఫార్మాట్‌లో 183 క్యాచ్‌లు పట్టాడు.. 14 స్టంపింగ్స్ కూడా చేశాడు.
దక్షిణాఫ్రికా తాజాగా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది. తెంబా బావుమా కెప్టెన్‌గా 15 మందితో కూడిన జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. సీనియర్ బ్యాటర్‌లు క్వింటన్ డికాక్, రిజా హెండ్రిక్స్, మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, కాగిసో రబాడ చోటు దక్కించుకున్నారు. కేశవ్ మహరాజ్, తబ్రెయిజ్ షంసీ స్పిన్నర్లుగా టోర్నమెంట్ లో సందడి చేయనున్నారు. క్వింటన్ డి కాక్ దక్షిణాఫ్రికా క్రికెట్‌కు గొప్ప సేవ చేశాడని దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ ఎనోచ్ ఎన్‌క్వే అన్నారు. "అతను తన అటాకింగ్ బ్యాటింగ్ శైలితో బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. కొన్నేళ్లుగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అతను కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే లభించే గౌరవం." అని కొనియాడారు.
డి కాక్ 50-ఓవర్ల క్రికెట్‌లో తన కెరీర్‌ను అద్భుతంగా మొదలుపెట్టాడు. వేగంగా 1000 పరుగులు (21 ఇన్నింగ్స్‌లలో) సాధించిన నాల్గవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను సెంచూరియన్‌లో తన కెరీర్-బెస్ట్ ఇన్నింగ్స్... 2016లో ఆస్ట్రేలియాపై 178 పరుగులు చేశాడు. 2020-2021లో దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించాడు. 2021లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలకనున్నాడు.
దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, డస్సెన్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, నోకియా, కాగిసో రబాడ, తబ్రెయిజ్ షంసీ.