ఏజ్ అడ్డుకాదు.. 43 ఏళ్ల వయసులో నంబర్ 1

పురుషుల డబుల్స్‌లో ఈ వయస్సులో నెం1గా నిలవడం నిజంగా అద్భుతం

Update: 2024-01-25 05:55 GMT

ఏదైనా సాధించాలని అనుకుంటే వయసు అడ్డంకి అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ అదేదీ నిజం కాదు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా ఎన్నో విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాంటి వారిలో భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న ఒకరు. రోహ‌న్ బోపన్న పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా అరుదైన రికార్డు సాధించాడు. 43 ఏళ్ల బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ డబుల్‌స్ లో మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి రోహన్ బోపన్న బరిలోకి దిగాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్మూడో స్థానంతో ఈ గ్రాండ్ స్లామ్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్‌, ఆండ్రూ మోల్టెనిపై బోపన్న జోడి 6-4, 7-6 విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ముగిసిన అనంతరం తాజా ర్యాంక్‌లను అధికారికంగా ప్రకటిస్తారు.

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సైతం రోహన్‌ బోపన్నపై ప్రశంసలు కురిపించారు. "వయస్సు ఒక సంఖ్య మాత్రమే. కానీ 'నంబర్ 1' అనేది మరొక సంఖ్య కాదు. అభినందనలు రోహన్! పురుషుల డబుల్స్‌లో ఈ వయస్సులో నెం1గా నిలవడం నిజంగా అద్భుతం"అని సచిన్‌ ప్రశంసించారు. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించిన నాలుగో భారత క్రీడాకారుడిగా రోహన్ బోపన్న రికార్డు సాధించాడు. అంతకుముందు భారత్ తరపున లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా ఈ ఘనత సాధించారు. గతంలో అత్యధిక వయస్సులో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న రికార్డు అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ (38 ఏళ్లు) పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును రోహన్ బోపన్న తుడిచి పెట్టాడు.


Tags:    

Similar News