ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్ ఇచ్చిన సచిన్.. పేరు ఏమని ఉందంటే?
ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ ప్రధాని మోదీకి ఓ చిరుకానుక ఇచ్చారు.
వారణాసిలో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ ప్రధాని మోదీకి ఓ చిరుకానుక ఇచ్చారు. అదేమిటంటే.. భారత క్రికెట్ జట్టు టీ షర్ట్. దాని వెనుక 'నమో' అని ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్టేడియం కోసం భూమిని సేకరించడానికి రూ. 121 కోట్లు వెచ్చించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దీని నిర్మాణానికి రూ. 330 కోట్లు వెచ్చించనుంది. వారణాసిలోని ఘాట్‌ల మెట్లను పోలిన ప్రేక్షకుల గ్యాలరీ ఉంటుంది. స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఏడు పిచ్‌లు ఉంటాయి. రాజతలాబ్ ప్రాంతంలోని రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఈ స్టేడియం డిసెంబర్ 2025 నాటికి సిద్ధమవుతుందని భావిస్తూ ఉన్నారు.