ఇండోనేషియా ఓపెన్ 2023 టైటిల్ భారత్ సొంతం : సాత్విక్ - చిరాగ్ రికార్డు
పోటాపోటీగా, ఉత్కంఠగా సాగిన ఫైనల్స్ లో ఇరు దేశాల ఆటగళ్లు తీవ్రంగా పోరాడారు. ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్ లో..
ఇండోనేషియా ఓపెన్ ఫైనల్స్ 2023లో భారత్ చెందిన సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి అద్భుత ప్రదర్శన చేసింది. పురుషుల డబుల్స్‌లో ఫైనల్ కు వెళ్లిన వీరి జోడి.. ఇండోనేషియా ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారత జంటగా రికార్డు సృష్టించింది. హోరా హోరీగా సాగిన సెమీ ఫైనల్లో ఏడో సీడ్ భారత జంట 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె జోడీని చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్స్ లో మలేషియా జోడీ ఆరోన్ చియా - సో వుయిక్ పై.. సాత్విక్ - చిరాగ్ వరుసగా రెండు సెట్లను 21-17, 21-18 తేడాతో విజయం సాధించారు.
పోటాపోటీగా, ఉత్కంఠగా సాగిన ఫైనల్స్ లో ఇరు దేశాల ఆటగళ్లు తీవ్రంగా పోరాడారు. ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్ లో సాత్విక్ - చిరాగ్ జోడీ ఆరవ ర్యాంక్ లో ఉన్నారు. ఇదే క్రమంలో వీరిద్దరికీ ఇదే తొలి సూపర్ 1000 టైటిల్ కావడం విశేషం. సూపర్ -1000 ఈవెంట్ లో డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత జోడీగా రికార్డు సృష్టించారు. ఇప్పటికే వీరి ఖాతాలో ప్రపంచ ఛాంపియన్ షిప్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్ మెడల్స్ ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా ఓపెన్ ఫైనల్స్ 2023లో విజేతలుగా నిలిచిన సాత్విక్ - చిరాగ్ లకు మిగతా క్రీడాకారులు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ఇండోనేషియా ఓపెన్ ఫైనల్స్ 2023లో గెలిచిన వీరు.. మెడల్స్ తో పాటు 92,500 యూస్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.75,77,183 లు ప్రైజ్ మనీ అందుకున్నారు.