Shuttler Praneeth: షాకింగ్ నిర్ణయం తీసుకున్న షట్లర్ సాయి ప్రణీత్

భారత షట్లర్ బి. సాయి ప్రణీత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు

Update: 2024-03-05 03:03 GMT

Shuttler Praneeth:భారత షట్లర్ బి. సాయి ప్రణీత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల అతను టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల తర్వాత నుండి తీవ్రమైన గాయాలతో పోరాడాడు. దాని కారణంగా అతడు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రణీత్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ధృవీకరించారు. 24 సంవత్సరాలుగా నా ప్రాణం లాంటి క్రీడకు వీడ్కోలు పలికేందుకు, రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యానని ప్రణీత్ తెలిపాడు. ‘‘భావోద్వేగాలతో వీడ్కోలు చెబుతున్నాను. గత 24 ఏళ్లుగా నాకు ఊపిరిగా ఉన్న ఆటకు ఇక వీడ్కోలు. ఈ రోజు నా జీవితంలో నూతన అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈ ఆటనే. బ్యాడ్మింటన్ నా ఫస్ట్ లవ్. నా క్యారక్టర్‌ను బ్యాడ్మింటన్ తీర్చి దిద్దింది. నా జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చింది. ఇన్నేళ్ల ఆటలో జ్ఞాపకాలు, అధిగమించిన సవాళ్లు ఎప్పటికీ నా హృదయంలో స్థిరంగా ఉంటాయి’’ అని ప్రణీత్ పోస్టు పెట్టాడు.

2017లో సింగపూర్‌ ఓపెన్‌ గెలిచిన సాయి ప్రణీత్.. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10 ర్యాంకింగ్స్‌లో నిలువడంతో ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ప్రణీత్ ను గాయాలు వెంటాడాయి. సింగపూర్‌ ఓపెన్‌, కెనడా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు ప్రణీత్‌. భారత ప్రభుత్వం ప్రణీత్ ను 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్నాడు. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీకి ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నట్టు ప్రణీత్ వెల్లడించాడు. ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిపాడు.


Tags:    

Similar News