నోరు విప్పిన సౌరవ్ గంగూలీ

Update: 2022-10-13 11:09 GMT

బీసీసీఐ అధ్య‌క్షుడిగా సౌరవ్ గంగూలీని కావాలనే తప్పించారని ఇన్ని రోజులూ కథనాలు వచ్చాయి. కొందరు గంగూలీ ఎదుగుదలను చూడలేకనే తప్పించారని వ్యాఖ్యలు చేయగా.. మరికొందరేమో బీజేపీలో గంగూలీ చేరకపోవడమే ఆయన ఉద్వాసనకు కారణమైందని ఆరోపించారు. ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో సౌర‌వ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంధ‌న్ బ్యాంక్ ఈవెంట్‌లో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. చాన్నాళ్ల నుంచి ప‌రిపాల‌కుడి పాత్ర‌ను పోషించాన‌ని, ఇప్పుడు మ‌రో పాత్ర‌ను పోషించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. చాన్నాళ్లుగా అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఉన్నాన‌ని, ఇప్పుడు మ‌రో ఉన్న‌త స్థానానికి వెళ్లాలని ఆశిస్తున్న‌ట్లు గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డారు. జీవితంలో ఏది చేసినా, ఉత్త‌మ రోజులు మాత్రం ఇండియాకు ఆడ‌డ‌మే అని అన్నారు. బీసీసీఐకి ప్రెసిడెంట్‌గా చేశాన‌ని, ఇక ముందు మ‌రిన్ని గొప్ప ప‌నులు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఎప్ప‌టికీ ప్లేయ‌ర్‌గా ఉండ‌లేమ‌ని, అలాగే ఎప్ప‌టికీ ప‌రిపాల‌కుడిగా ఉండ‌లేమ‌ని అన్నారు. ఆ రెండూ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని గంగూలీ అన్నారు.

"నేను ఐదేళ్లు CAB అధ్యక్షుడిగా ఉన్నాను. మూడు సంవత్సరాలు BCCI అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఇప్పుడు ఇంకేదైనా చేస్తాను. నా క్రికెట్ కెరీర్‌లో 15 ఏళ్లు అత్యుత్తమమైనవి. క్రికెటర్‌గా సవాలు చాలా ఎక్కువ, నిర్వాహకుడిగా, మీరు జట్టుకు మంచి విషయాలు అందించాలి. నేను ఆటగాడిగా కెరీర్ ను పూర్తిగా ఆస్వాదించాను." అని గంగూలీ అన్నారు.
1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ గంగూలీ తర్వాత బీసీసీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. జే షా బోర్డు కార్యదర్శిగా కొనసాగుతారు. గంగూలీతో పాటు బోర్డులో మరికొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా సుదీర్ఘ చర్చల తర్వాత 67 ఏళ్ల బిన్నీ బీసీసీఐకి 36వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఎలాంటి ఎన్నికలు ఉండవని, అక్టోబర్ 18న ముంబైలో జరిగే AGMలో బిన్నీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.



Tags:    

Similar News