బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా

Update: 2022-10-27 07:00 GMT

సిడ్నీ వేదికగా సూపర్-12 లో భాగంగా బంగ్లాదేశ్ ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేశారు. ఛేజింగ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఏ మాత్రం ప్రతిఘటించకపోగా.. వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టడంతో 101 పరుగులకు ఆలౌట్ అయ్యారు. 16.3 ఓవర్ల వద్ద బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. నోకియా 3.3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లో లిట్టన్ దాస్ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీగా పరుగులను రాబట్టింది. రైలీ రుసోవ్ కేవలం 52 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. రైలీ రుసోవ్ ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రూసో భారీ షాట్‌కు ప్రయత్నించి షకీబ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్ అయ్యాడు. రైలీ రుసోవ్ 109 రన్స్‌ చేసి నిష్క్రమించాడు. టీ20ల్లో రైలీ రుసోవ్ కు ఇది రెండవ సెంచరీ కావడం విశేషం. దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 రన్స్‌ చేసింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకున్నది. రెండో వికెట్‌కు డికాక్‌, రైలీ రుసోవ్ మధ్య 163 రన్స్‌ భాగస్వామ్యం ఏర్పడింది. డీకాక్‌ కూడా ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. అతను 38 బంతుల్లో 63 రన్స్‌ చేశాడు. రైలీ రుసోవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Tags:    

Similar News