భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాకిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో మన బౌలర్లు సక్సెస్ అయ్యారు. తొలుత ఊపు చూసి పాకిస్థాన్ 280 పరుగులు చేస్తుందని భావించినా 241పరుగులకే పాకిస్థాన్ ను భారత్ బౌలర్లు ఆల్ అవుట్ చేయగలిగారు. భారత్ విజయలక్ష్యం 242 పరుగులుగా మారింది. హార్ధిక్ పాండ్యాకు రెండు, కులదీప్ యాదవ్ కు మూడు, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ తీశారు. రెండు రనౌట్లు చేయడంతో పాకిస్థాన్ తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయింది. . పాకిస్థాన్ బ్యాటర్లలో రిజ్వాన్, షకీల్ లు మాత్రమే రాణించగలిగారు. షకీల్ ఒక్కడే పాక్ బ్యాటర్లలో అర్ధ సెంచరీ చేశాడు. భారత్ ఆరు వికెట్ల తేడాతో ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఛేదనలో...
తర్వాత బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. ఓవర్ కు ఆరు పరుగుల రన్ రేటు తేగలిగారు. దీంతో భారత్ ఎక్కడా పెద్దగా టెన్షన్ పడలేదు. అయితే రోహిత్ శర్మ 20 పరుగులు వద్ద అవుట్ కాగానే భారత్ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. కానీ విరాట్ కోహ్లి ఆ అనుమానాలను పటాపంచలు చేయగలిగాడు. శుభమన్ గిల్ తో కలిపిి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ కలసి బాగానే ఆడుతుండటంతో ఎవరికి భారత్ విజయం పై అనుమానాలు రాలేదు. అయితే 46 పరుగుల వద్ద శుభమన్ గిల్ అవుట్ కావడంతో మరోమారు భారత్ ఫ్యాన్స్ కొంత అసహనం ఫీలయ్యారు. అర్ధ సెంచరీ పూర్తి చేయకుండా గిల్ అవుట్ కావడం కొంత బాధ అనిపించింది.
కోహ్లి సెంచరీ తో...
కానీ విరాట్ కోహ్లి ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. పాకిస్థాన్ మీద తన చేవ తగ్గలేదని నిరూపించాడు. పాకిస్థాన్ పై తనకున్న రికార్డు చెదిరిపోదని మరోసారి అభిమానులకు చూపించాడు. నిలకడగా ఆడుతూ, స్ట్రోక్స్ కొడుతూ స్కోరును పెంచాడు. కోహ్లికి, శ్రేయస్ అయ్యర్ తోడయ్యాడు. ఇద్దరు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అప్పటికే భారత్ విజయం ఖాయమయింది. ఇండియన్ ఫ్యాన్స్ స్టేడియంలో సంబరాలు షురూ చేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 56 పరుగుల వద్ద అవుట్ కావడంతో తర్వాత వచ్చిన హార్ధిక్ పాండ్యా ఫోర్ కొట్టి అలరించినా వెంటనే అవుట్ అయ్యాడు. తర్వాత అక్షర్ పటేల్ వచ్చి విరాట్ కోహ్లి సెంచరీ చేయడానికి సహకరించాడు. విరాట్ తన అంతర్జాతీయ మ్యాచ్ లలో 51వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఫలితంగా పాక్ ఇంటి దారి పట్టింది. భారత్ జయకేతం ఎగురవేసింది. సెమీ ఫైనల్స్ కు సులువుగా వెళ్లగలిగింది.