INDvsBAN: తెలుగోడికి దక్కిన సూపర్ ఛాన్స్

ఆదివారం నుండి బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ మొదలు కాబోతూ ఉండగా

Update: 2024-10-05 15:42 GMT

ఆదివారం నుండి బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ మొదలు కాబోతూ ఉండగా హైదరాబాదీ సెన్సేషన్ తిలక్ వర్మకు భారత జట్టులో చోటు దక్కింది. వెన్ను గాయం కారణంగా ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. గాయం కారణంగా 31 ఏళ్ల దుబే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. "ఆల్ రౌండర్ శివమ్ దూబే వెన్ను గాయం కారణంగా మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు దూరమయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ శివమ్ స్థానంలో తిలక్ వర్మను ఎంపిక చేసింది." అంటూ బీసీసీఐ నుండి ప్రకటన వచ్చింది.

డొమెస్టిక్ సర్క్యూట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆకట్టుకున్న 21 ఏళ్ల తిలక్ వర్మ ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌కు ముందు గ్వాలియర్‌లో భారత బృందంలో చేరనున్నాడు. తిలక్ వర్మ దూకుడైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. భారతదేశం తరపున ఇప్పటికే 16 T20 ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. మిడిల్ ఆర్డర్‌ను బలపరిచే సామర్థ్యం ఉన్న యువ ఆటగాడు అంటూ ఇప్పటికే పలువురు క్రికెటర్లు ప్రశంసలు గుప్పించారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు తిలక్ వర్మ. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం గ్వాలియర్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో, చివరి మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరుగుతుంది.


Tags:    

Similar News