బ్యాడ్మింటన్ గురు పుల్లెల గోపీచంద్ కూతురు సంచలనం

క్వార్టర్ ఫైనల్స్ లో చైనా జంట లీవెన్ మీ - లూ గ్జువాన్ తో గాయత్రి జంట తాడోపేడో తేల్చుకోనుంది. కాగా.. భారత్ తరపున భారీ..

Update: 2023-03-17 04:51 GMT

pullela gayatri gopichand

భారత బ్యాడ్మింటన్ గురు గా పేరొందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి సంచలన ప్రదర్శన ఇచ్చింది. ఆమె అద్భుతమైన ప్రదర్శన చూసి అందరూ అభినందించారు. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ లోకి పుల్లెల గాయత్రి ఎలాంటి అంచనాలు లేకుండా దిగింది. మహిళల డబుల్స్ లో ట్రీసా జాలీతో కలిసి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ప్రి క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాపియన్లకు చెక్ పెట్టి సంచలనం సృష్టించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్ లో గాయత్రి జంట 21-14, 24-22తో జపాన్‌ ద్వయం యుకీ ఫుషిమా-సయాకపై గెలిచింది.

క్వార్టర్ ఫైనల్స్ లో చైనా జంట లీవెన్ మీ - లూ గ్జువాన్ తో గాయత్రి జంట తాడోపేడో తేల్చుకోనుంది. కాగా.. భారత్ తరపున భారీ అంచనాలతో బరిలోకి దిగిన సింగిల్స్ స్టార్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌ నిరాశ పరిచారు. పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్లో లక్ష్యసేన్‌ 13-21, 15-21తో ఆండ్రెస్‌ అంటాన్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. అలాగే శ్రీకాంత్ కూడా.. 17-21, 15-21తో కొడాయి నరవొక (జపాన్‌) చేతిలో ఓడిపోగా.. ప్రణయ్‌ 20-22, 21-15, 17-21తో ఆంథోనీ గింటింగ్‌ (ఇండోనేసియా) చేతిలోపోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ లో టాప్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి కూడా రెండో రౌండ్ లోనే వెనుదిరిగింది. ఆరోసీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-10, 17-21, 19-21తో చైనా జోడీ లియాంగ్‌-వాంగ్‌ చాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. ఇప్పుడు ఆశలన్నీ పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రిపైనే ఉన్నాయి. గాయత్రి గోపీచంద్ 2022 లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో మిక్స్ డ్ టీంలో రజత పతకం, మహిళల డబుల్స్ లో కాంస్య పతకం సాధించింది.


Tags:    

Similar News