పాక్ ను ఓటమి పాలు చేసిన 'అంపైర్ కాల్'

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఇండియా తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత

Update: 2023-10-28 02:48 GMT

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఇండియా తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. శుక్రవారం చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం ‘అంపైర్స్ కాల్’. 271 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ విజయానికి ఒక్క వికెట్ అవసరం కాగా.. దక్షిణాఫ్రికా గెలుపుకు 11 పరుగులు అవసరం అయ్యాయి. అయితే అంపైర్స్ కాల్ రూపంలో పాకిస్థాన్‌ను దురదృష్టం వెంటాడింది.

పాకిస్థాన్ సీనియర్ పేసర్ హరీష్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతి దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షంసీ పాడ్స్ తాకింది. పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే కెప్టెన్ బాబర్ ఆజామ్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్.. అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను లైట్‌గా తాకడంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కారణంగా నాటౌట్ ఇచ్చాడు. దాంతో షంసీ అవుట్ కాకపోవడం.. ఆ తర్వాత మహరాజ్ ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. బాల్ ట్రాకింగ్‌లో 50 శాతం కంటే తక్కువ లెగ్ లేదా ఆఫ్ స్టంప్‌ను బంతిని తాకితే అంపైర్స్ కాల్‌గా పరిగణిస్తారు. ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయమే ఫైనల్. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే.. తబ్రైజ్ షంసీ అవుట్ అయ్యేవాడు. దాంతో ప్రొటీస్ జట్టు 263 పరుగులకే ఆలౌటయ్యేది. అప్పుడు పాక్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. కానీ ఇక్కడ అలా జరగకపోవడంతో పాక్ జట్టు ఓటమిని మూటగట్టుకుంది.


Tags:    

Similar News