భారత్ విజయం తర్వాత కోహ్లీ చెప్పింది ఇదే

Update: 2022-10-23 14:04 GMT

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో భారత్ విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా, పాక్ స్పిన్నర్ నవాజ్ వేసిన తొలి బంతికే హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు. కోహ్లీ సిక్సర్ గా మలిచి ఒత్తిడిని తగ్గించాడు. ఆ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించగా, కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కానీ బంతి ఫీల్డర్ల నుంచి దూరంగా వెళ్లడంతో కోహ్లీ, కార్తీక్ మూడు పరుగులు తీయడంతో చివర్లో రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. కార్తీక్ అవుట్ కావడంతో క్రీజులోకి అశ్విన్ వచ్చాడు. నవాజ్ ఓ వైడ్ వేశాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా, అశ్విన్ ఓ లాఫ్టెడ్ డ్రైవ్ తో విన్నింగ్ షాట్ కొట్టాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, హార్దిక్ పాండ్యా జోడీ భారత్ ను ఆదుకుంది. పాండ్యా 37 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 40 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2, మహ్మద్ నవాజ్ 2 వికెట్లు తీశారు.
విరాట్ కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది. కోహ్లీ మాట్లాడుతూ ఏం మాడ్లాడాలో తెలియడంలేదని, మ్యాచ్ ను ఎలా గెలిచామో ఇప్పటికీ నమ్మశక్యం కావడంలేదని.. చివరివరకు క్రీజులో ఉంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తామని హార్దిక్ పాండ్యా గట్టిగా నమ్మాడని కోహ్లీ అన్నాడు. పెవిలియన్ ఎండ్ నుంచి షహీన్ అఫ్రిది బౌలింగ్ చేస్తే అతడికి కొట్టాలని నిర్ణయించుకున్నామన్నాడు. హరీస్ రవూఫ్ వాళ్ల ముఖ్యమైన బౌలర్. అతడి బౌలింగ్ లో కొడితే.. పాక్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని నాకు తెలుసు.. అందుకే అతడి బౌలింగ్ లో రెండు సిక్సులు కొట్టాను. ఇవాళ్టి వరకు నేను ఆడిన ఇన్నింగ్స్ లలో మొహాలీలో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పేవాడ్ని. కానీ ఇవాళ్టి నుంచి పాకిస్థాన్ తో మ్యాచే నా బెస్ట్ ఇన్నింగ్స్ అంటాను. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సహకారం మరువలేను. ముఖ్యంగా ప్రేక్షకుల మద్దతు అమోఘం. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అంటూ కోహ్లీ వివరించాడు.


Tags:    

Similar News