Virat Kohli : విరాట్ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. మనసు కూడా వెన్నే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే విరాట్ కోహ్లి సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నాడు
విరాట్ కోహ్లికి డబ్బుల మీద వ్యామోహం లేదు. కేవలం కీర్తి ప్రతిష్టల పైనే. కింది స్థాయి నుంచి వచ్చి క్రికెట్ లో నిలదొక్కుకుని అన్ని రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లి అంటే అందరికీ అభిమానమే. కోహ్లి క్రీజులో ఉంటే చాలు స్టేడియం మొత్తం ఉర్రూతలూగాల్సిందే. విరాట్ కు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. విరాట్ కోహ్లి చిన్న వయసు నుంచి కష్టపడి.. బ్యాట్ తో తన సత్తాను చాటి పైకి వచ్చాడు. ఆ విషయాన్ని మాత్రం అతడు మర్చిపోడు. ఎంత ఎదిగినా మనం ఎవరమనేది గుర్తుంచుకోవాలనుకునే అతి కొద్ది మంది క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకరని చెప్పకతప్పదు. అతడు సుదీర్ఘకాలం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు.
ఎదుగుదలకు...
ఇప్పుడు ఐపీఎల్ వేలం ప్రారంభం కాకముందు అనేక మంది తాము గతంలో ఆడిన జట్లను వీడుతున్నారు. జట్లను వీడే వాళ్లంతా డబ్బు కోసమే కాదు కానీ, వారికి మేనేజ్‌మెంట్ తో ఉన్న విభేదాలు కారణం కావచ్చు. మేనేజ్‌మెంట్ వైఖరి, వ్యవహారశైలి నచ్చకపోవచ్చు. అలాగని తమకు కష్టకాలంలో ఆదుకుని, కొంత వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా, ఎదుగుదలకు పరోక్షంగా కారణమైన వారిని వదలిపెట్టని వారు కూడా కొందరుంటారు. అలాంటి వారిలో విరాట్ కోహ్లి ఒకరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున విరాట్ ఆడుతూనే ఉన్నారు. అతను బయటకు వస్తే కొనుగోలు చేయడానికి, అత్యధిక మొత్తంలో డబ్బులు చెల్లించడానికి ఫ్రాంచైజీలు క్యూ కడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.
వీడేది లేదని...
కానీ విరాట్ కోహ్లి బెంగళూరును మాత్రం వీడనంటున్నారు. తాను ఒకదశలో రాయల్ ఛాలెంజర్స్ వీడదామని అనుకున్నానని, కానీ తన మనసు అందుకు అంగీకరించలేదని కోహ్లి చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్ల తన విధేయతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఆర్సీబీ ఇంత వరకూ ట్రోఫీ గెలవకపోయినా విరాట్ కోహ్లిని నిలబెట్టింది ఆ ఫ్రాంచైజీ అని ఆయన చెప్పడం కోహ్లి విధేయతకు నిదర్శనం. తమ పట్ల టీం మేనేజ్‌మెంట్ చూపే గౌరవాన్ని తాను కాలదన్నుకుని వేరే టీం లోకి వెళ్లేందుకు మనసొప్పలేదని విరాట్ తన మనసులో మాట చెప్పేశాడు. క్రికెట్ లోనే కాదు.. మనసులోనూ రారాజు అనిపించుకున్న కోహ్లికి ఎవరు మాత్రం అభిమానిగా మరారు. అందుకే కోహ్లి అంటే అందరికీ ప్రేమ. అభిమానం. మక్కువ. దటీజ్ విరాట్.