Cricket Balls: క్రికెట్‌లో ఎన్ని రకాల బంతులు? వాటి ధరలు ఎంత?

క్రికెట్ ఆట అంటే తెలియని వారుండరు. ఇప్పుడు క్రికెట్‌ను గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న పిల్లల..

Update: 2023-11-19 14:54 GMT

క్రికెట్ ఆట అంటే తెలియని వారుండరు. ఇప్పుడు క్రికెట్‌ను గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆడుతుంటారు. ఇక మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే పిల్లలతో సహా పెద్దలు టీవీల ముందు వాలిపోతుంటారు. భారత్‌లో క్రికెట్‌ ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. చిన్న పిల్లలు సైతం మామూలు బాల్‌లో క్రికెట్‌ ఆడుతుంటారు. రబ్బరు బంతితో, పెద్దవారు టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడడం సాధారణం.

క్రికెట్ ఆటలో బంతి కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాటర్లు బ్యాటుతో ఎంత రెచ్చిపోయినా చివరకు ఒక్క మంచి బంతికి ఔటవుతుంటారు. ఒక్కోసారి ఆ ఒక్క బంతే గెలుపోటములను నిర్ణయిస్తుంది. బంతి బౌండరీ దాటితే బ్యాటింగ్ జట్టుకు.. వికెట్లను తాకితే బౌలింగ్ జట్టుకు ప్రయోజనం. కాబట్టి ఒక జట్టు గెలుపోటములను బంతి నిర్ణయిస్తుంది. అయితే అంతర్జాతీయ మ్యాచుల్లో క్రికెట్ ఆడటానికి ఎలాంటి బంతి ఉపయోగిస్తారు? ఎన్ని రకాల బంతులు వాడతారు? వాటిని ఎలా తయారు చేస్తారు? వీటి గురించి తెలుసుకుందాం.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి బంతిని ఉపయోగిస్తారు:

అంతర్జాతీయ క్రికెట్ లో కార్క్ బంతిని ఉపయోగిస్తారు. వీటిని తోలుతో కప్పబడిన కార్క్ బాడీతో తయారు చేస్తారు. ఈ తోలు రెండు లేదా నాలుగు వరుసల్లో ఉంటుంది. వాటిని ఆరు వరుసల కుట్లతో కుడతారు. ఆ కుట్లనే సీమ్ అంటారు. ఈ కార్క్‌ బంతిని అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపయోగిస్తుంటారు.

బంతి సైజు ఎంత?

క్రికెట్ బంతులు దాదాపు 23 సెం.మీ వ్యాసం, 160 నుంచి 163 గ్రాముల బరువు ఉంటాయి. మహిళల క్రికెట్ లో ఈ పరిమాణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే క్రికెట్‌ ఆటతో పాటు బంతులు కూడా మార్పులు చెందాయి. ప్రస్తుతం మూడు రకాల బంతులను క్రికెట్ ఆడేందుకు ఉపయోగిస్తున్నారు. అవేంటో చూద్దాం.

రెడ్ బాల్

అసలు క్రికెట్ బంతి ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని టెస్ట్ మ్యాచులు, దేశవాళీ టోర్నీల్లో ఉపయోగిస్తుంటారు. దీనిని చేతితోను లేదా యంత్రంతోనూ తయారు చేస్తారు. ఇది అధిక దృఢత్వంతో ఉంటుంది. టెస్ట్ ఫార్మాట్లో రోజుకు 80 నుంచి 90 ఓవర్లు ఆడతారు. అందుకు అనుగుణంగా చాలా దృఢంగా ఉండేలా అత్యున్నత మన్నికతో రెడ్ బాల్‌ను తయారు చేస్తారు. ఆట సాగేకొద్దీ బంతి అరుగుతుంది. అలాంటప్పుడు బౌలర్లు దాన్ని అంతగా స్వింగ్ చేయలేరు.

వైట్ బాల్:

ఒక రోజు (వన్డే) క్రికెట్ ఫార్మాట్ రావటం వైట్ బాల్ ను ఉపయోగిస్తుంటారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎర్ర బంతి పిచ్ రంగుకు దగ్గరగా ఉండడం వలన కనిపించదు. కాబట్టి తెలుపు రంగు బంతిని తయారు చేశారు. రెడ్ బాల్ తో పోలిస్తే వైట్ బాల్ నాణ్యత, మన్నిక తక్కువగా ఉంటుందని క్రికెట్‌ నిపుణులు చెబుతున్నారు. బంతిని కుట్టిన ప్రాంతాన్ని సీమ్ అంటారు. ఎరుపు బంతితో పోలిస్తే తెలుపు బంతి కొన్ని సందర్భాల్లో వెడల్పు ఎక్కువగా ఉంటుంది. టీ20 ఫార్మాట్ లోనూ తెలుపు రంగు బంతినే వాడుతుంటారు.

పింక్ బాల్

టెస్ట్ క్రికెట్ లో డే-నైట్ ఫార్మాట్ ప్రవేశపెట్టినప్పుడు పింక్ బాల్ ను తీసుకువచ్చారు. రాత్రి వేళ ఎరుపు బంతి అంతగా కనిపించదు కాబట్టి తెల్ల బంతి నాణ్యత తక్కువగా ఉండడం వల్ల ఈ ఫార్మాట్ కు పనికిరాదు. అందుకే పింక్ బంతిని ప్రవేశపెట్టారు. ఎరుపు, తెలుపు రంగుల కన్నా పింక్ కలర్ ఎక్కువ స్థిరత్వంతో ఉంటుంది. రాత్రివేళ బాగా కనిపిస్తుంది.

క్రికెట్ బంతులను మూడు ప్రధాన కంపెనీలు తయారు చేస్తాయి. డ్యూక్స్, కూకబుర్రా, ఎస్జీ. డ్యూక్స్‌ని ఇంగ్లండ్, వెస్టిండీస్.. కూకబుర్రను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.. SGని భారతదేశం ఎక్కువగా ఉపయోగిస్తుంది.

బంతి ధర ఎంత?

సాధారణంగా ఉపయోగించే కూకాబుర్ర వైట్ బాల్ ధర సుమారు రూ. 15 వేల వరకు ఉంటుంది. వివిధ వెబ్ సైట్లలో రూ. 13 వేల నుంచి రూ. 17 వేల వరకు లభ్యమవుతుంది. టెస్టులకు ఉపయోగించే ఎస్జీ రెడ్ బాల్ ధర కూడా ఇంచుమించు అదే ధరతో ఉంటుంది.

Tags:    

Similar News