ఎవరీ రాబిన్ మింజ్..? పేరు మార్మోగుతోంది..!
ఐపీఎల్ మినీ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. వేలం సందర్భంగా యువకుల నుంచి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల వరకూ పలువురు భారీ ధర పలికారు
ఐపీఎల్ మినీ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. వేలం సందర్భంగా యువకుల నుంచి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల వరకూ పలువురు భారీ ధర పలికారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కోసం జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. రాబోయే సీజన్ కోసం కేకేఆర్ అతనిని వేలంలో రూ. 24 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. స్టార్క్‌తో పాటు.. పాట్ కమిన్స్, డారిల్ మిచెల్, హర్షల్ పటేల్, అల్జారీ జోసెఫ్ వంటి ఆటగాళ్లపై లక్ష్మి దేవి దయ చూపింది. ఈ అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురవడం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వేలానికి ముందే అన్ని జట్లూ ఈ ఆటగాళ్లపై విపరీతంగా డబ్బు వెచ్చించవచ్చని భావించారు. సరిగ్గా అదే జరిగింది. అదే అన్‌క్యాప్డ్ ప్లేయర్ అధిక ధరకు అమ్ముడుపోతే.. అది కదా ఆశ్చర్యపోవాల్సిన విషయం..!
వేలంలో ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌పై కూడా డబ్బుల వర్షం కురిపింది. దీంతో ఆ ఆటగాడి గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఈ యువ ఆటగాడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. అతడే జార్ఖండ్‌కు చెందిన 21 ఏళ్ల యువ వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ రాబిన్ మింజ్. 3 కోట్ల 60 లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి గుజరాత్ టైటాన్స్ జట్టు మింజ్‌ను తమ జట్టులో చేర్చుకుంది.
21 ఏళ్ల యువ ఆటగాడు మూడు కోట్లకు పైగా ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మింజ్ జార్ఖండ్‌కు చెందిన గిరిజన కుటుంబానికి చెందినవాడు. గిరిజన సామాజిక వర్గం నుంచి ఐపీఎల్ ఆడుతున్న మొదటి క్రికెటర్ కావడం విశేషం. రాబిన్ మింజ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నమ్‌కుమ్‌లో నివాసి. రాబిన్ మింజ్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. జార్ఖండ్‌కు చెందిన మాజీ లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రాబిన్ మింజ్ రోల్ మోడల్. కోచ్ ఆసిఫ్ శిక్షణలో మింజ్ ఇంత దూరం ప్రయాణించాడు. ఇది మాత్రమే కాదు.. జార్ఖండ్ రాష్ట్ర ఎస్పీ గౌతమ్ నుండి కూడా మింజ్‌కు మద్దతు లభించింది.
మింజ్ తండ్రి మాజీ సైనికుడు. ప్రస్తుతం పదవీ విరమణ అనంతరం విమానాశ్రయ భద్రతలో విధులు నిర్వహిస్తున్నారు. అండర్-19 ఓపెన్ ట్రయల్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 60 పరుగులు చేయడంతో మింజ్ మొదటిసారిగాఅందరి దృష్టికి వచ్చాడు. ఆ ఇన్నింగ్సులో అతడు ఐదు భారీ సిక్సర్లు బాదాడు. అండర్-25లో కూడా ప్రాతినిథ్యం వహించాడు. అయితే రంజీల్లో ఆడే అవకాశం ఇంకా రాలేదు. ఈ క్రమంలోనే శిక్షణ కోసం ముంబై ఇండియన్స్‌కు చెందిన శిబిరంలో చేరడానికి ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ రాటుదేలిన మింజ్‌ను వేలంలో అనూహ్యంగా గుజరాత్ దక్కించుకుంది. వేలంలో రాబిన్‌ను దక్కించుకోవడానికి గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోరు సాగింది.