T20 WorldCup: టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు ఊహించని షాక్

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత జట్టు ఘోర పరాజయంతో

Update: 2024-10-04 17:46 GMT

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత జట్టు ఘోర పరాజయంతో టోర్నమెంట్ ను ఆరంభించింది. న్యూజిలాండ్ మహిళల జట్టు భారత జట్టును 58 పరుగుల తేడాతో ఓడించి శుభారంభాన్ని అందుకుంది. ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది, కానీ టోర్నీలో అగ్ర జట్లలో ఒకటైన భారత్‌ను భారీ తేడాతో ఓడించింది. కఠినమైన గ్రూప్‌లో భారత్‌ అవకాశాలకు ఇది పెద్ద దెబ్బ. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయింది.

టాస్ గెలిచిన కివీస్ 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. బేట్స్ 27 పరుగులు.. ప్లిమ్మర్ 34 పరుగులతో రాణించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సోఫీ డివైన్ హాఫ్ సెంచరీతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. 36 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది సోఫీ. భారత బౌలర్లలో రేణుక సింగ్ రెండు వికెట్లు తీయగా, అరుంధతి రెడ్డి, ఆశా శోభన చెరొక వికెట్ తీశారు.

ఇక ఛేజింగ్ లో భారత ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. షిఫాలీ రెండో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టింది. ఆ తర్వాత 28 పరుగుల వద్ద 12 పరుగులు చేసిన స్మృతి మందాన నిష్క్రమించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 15 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిందంటే భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 19 ఓవర్లలో భారత జట్టు 102 పరుగులకు ఆలౌట్ అయింది. రోస్ మేరీ 4 వికెట్లు తీసి భారత జట్టు పతనాన్ని శాసించింది.


Tags:    

Similar News