'7' కు రిటైర్మెంట్ ఇచ్చేసిన బీసీసీఐ
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా భారతదేశానికి చేసిన సేవలు ఏ క్రికెట్ అభిమాని
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా భారతదేశానికి చేసిన సేవలు ఏ క్రికెట్ అభిమాని మరచిపోడు. అలాంటి ఆటగాడికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అద్భుతమైన ట్రిబ్యూట్ ఇచ్చింది. గతంలో సచిన్ టెండూల్కర్ వేసుకున్న జెర్సీ నెంబర్ 10కి ఎలాగైతే రిటైర్మెంట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే తరహాలో ధోని విషయంలో ప్రవర్తించింది బీసీసీఐ. ఇకపై భారత మాజీ కెప్టెన్ MS ధోనీ నంబర్ 7 జెర్సీ ఏ ఆటగాడికి కూడా అందుబాటులో ఉండదు. BCCI ఐకానిక్ జెర్సీ నంబర్‌ను రిటైర్ చేయాలని నిర్ణయించింది. "భారత క్రికెట్ బోర్డు, ధోని చేసిన కృషికి అతడి జెర్సీ నెంబర్ 7 ను 'రిటైర్' చేయాలని నిర్ణయించుకుంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక నివేదిక తెలిపింది.
మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ ఇలా గౌరవించింది. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు, భారత జట్టులో స్థానం సంపాదించబోయే ఆటగాళ్లు ధోనీ నంబర్ 7 జెర్సీని ఎంచుకోవద్దని బీసీసీఐ సూచించింది. ఇకపై నెంబర్ 7 జెర్సీని కొత్త ఆటగాళ్లు పొందలేరు. భారత్ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెంబర్ 10 జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. అప్పట్లో నెంబర్ 10 వేసుకుని శార్దూల్ ఠాకూర్ గ్రౌండ్ లోకి దిగగానే పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. దీంతో ఆ నంబర్ ను ఇకపై ఇతర ఆటగాళ్లు ధరించకుండా సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత అతని జెర్సీ నంబర్ 10కి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ పై ఉన్న గౌరవంతో భవిష్యత్ లో ఏ భారత క్రికెటర్ కు ఆ జెర్సీ నెంబర్ ను కేటాయించబోమని బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కూడా సచిన్ 10 జెర్సీని ఉపయోగించకూడదని రిటైర్మెంట్ ప్రకటించింది.