Sarfaraz Kan : విశాఖ నిలబెడుతుందా? సర్ఫరాజ్ ఖాన్ ఆశలన్నీ ఇక్కడే
విశాఖలో జరుగుతున్న రెండో టెస్ట్‌కు యువఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యారు
అంతే మనోళ్లు ఓడిపోతే కాని కళ్లు తెరవరు. యువకులకు అవకాశం కల్పించారు. సీనియర్లు ఎంతగా ఫెయిలవుతున్నా మ్యాచ్‌లు గెలుస్తుంటే బీసీసీఐ పట్టించుకోదు. గెలిచాం కదా? అని తనకు తానే సర్ది చెప్పుకుంటుంది. కానీ భవిష్యత్ గురించి ఆలోచించదు. ఫామ్ కోల్పోయిన వారిని కూడా టీంలోనే కొనసాగిస్తూ జట్టులో గుదిబండగా మారుస్తుంది. ఇది బీసీసీఐకి అలవాటేనన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
సీనియర్లకు గాయాలు...
అయితే ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో మాత్రం మార్పులు చేయక తప్పింది కాదు. తొలి టెస్ట్ ఓటమి పాలు కావడంతో రెండో టెస్ట్ లో యువకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. గాయాల కారణంగా జడేజా, కేఎల్ రాహుల్ విశాఖ మ్యాచ్ ను ఆడటం లేదు. విరాట్ కొహ్లి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉంటారని తొలుతే బీసీసీఐ ప్రకటించింది. దీంతో కొత్తవారిని ఎంపిక చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు బీసీసీఐకి కల్పించాయి. అందుకే యువకులను జట్టులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయింది.
కొత్త కెరటాలు...
భారత్ జట్టులోకి మరో మెరుపు లాంటి ఆటగాడు వస్తున్నాడు. అతడే సర్ఫరాజ్ ఖాన్. ఈ యువ ఆటగాడు అండర్ 19 ప్రపంచకప్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐర్లాండ్ పై 118 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ యూఎస్‌ఏపై 73 పరుగులు చేశాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ కు విశాఖలో జరిగే టెస్ట్ లో ఆడేందుకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ తో పాటు స్పిన్నర్ సౌరభ్ కుమార్, ఆలరౌండర్ వాషింగ్టన్ సుందర్ కు కూడా అవకాశమిచ్చింది. ఈ అవకాశాన్ని కొత్తోళ్లు సక్రమంగా ఉపయోగించుకుంటే టీం ఇండియాకు మరో మంచి ఆటగాళ్లు దొరికినట్లే.