స్పీడ్ పెంచండి.. బైక్ ఎక్కండి.. బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యచరణపైన ఆయన చర్చించారు. బండి సంజయ్
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నారు.. అప్పటిలోగా రాష్ట్రమంతా బలోపేతం కావాలి.. అధికారంలోకి రావాలంటే, ఇప్పుడు పని చేస్తున్న వేగం సరిపోదు.. స్పీడ్ పెంచండి అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కోసం రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా... రాష్ట్ర బీజేపీలోని కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యచరణపైన ఆయన చర్చించారు. బండి సంజయ్ పాదయాత్రకు వచ్చిన స్పందన పట్ల అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు రెండు విడతల్లో 27 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగిందని బీజేపీ నేతలు చెప్పిన మాటలకు మాత్రం అమిత్ షా కొంచెం పెదవి విరిచారట. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆయన బీజేపీ నేతలకు చెప్పారు.
అంతలోగానే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆదేశించారు. పాదయాత్రకు సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి మరో విధంగా ఈ యాత్రను కొనసాగించాలని, వేగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేయాలని సూచించారు. ద్విచక్ర వాహన యాత్ర చేస్తే బాగుంటుందనే ఒక సూచన కూడా అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇచ్చారని సమాచారం.
ద్విచక్ర వాహన యాత్ర అయితే వేగంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేయవచ్చని ఆయన సూచించారట. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. తుక్కుగూడ బహిరంగ సభకు వచ్చిన స్పందన పట్ల కూడా అమిత్ షా సంతృప్తి చెందారని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.
ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలిరావడంతో సక్సెస్ అయ్యింది. సభను సమర్థంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్‌ను అమిత్ షా అభినందించారు. ఒకరకంగా చెప్పాలంటే గతంలో రాష్ట్రంలో జరిగిన బీజేపీ సభల కంటే ఈ సభకు ఎక్కువ ప్రజలు వచ్చారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన రాహుల్ గాంధీ సభకు ధీటుగా అమిత్ షా సభకు జనసమీకరణ చేయడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు.