Telangana : నిజమైన సంక్రాంతి ఈ ఏడాది.. తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు నిజమైన సంక్రాంతి ఈ ఏడాది జరగనుంది. సంక్రాంతి పండగకు రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనుంది
తెలంగాణ ప్రజలకు నిజమైన సంక్రాంతి ఈ ఏడాది జరగనుంది. సంక్రాంతి పండగకు రెండు పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనుంది. రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించనుంది. ఒకే పండగకు రెండు పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. సంక్రాంతి నాటికి ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. కొత్త ఇంటి నిర్మాణం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న లబ్దిదారులకు మాత్రం ఇది తీపి వార్త అనే చెప్పాలి.
ఇందిరమ్మఇళ్లను...
ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి నాటికి మంజూరుచేయాలని నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఆదేశాలను జారీ చేస్తుంది. వారికి ఇళ్లు నిర్మించుకోవడం కోసం ఐదు లక్షల రూపాయలు దశల వారీగా ఇవ్వనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే యాప్ లను కూడా సిద్ధం చేసింది. యాప్ ద్వారా తాము దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. స్థలంలేనిపేదలకు మాత్రం రెండో విడతలో ఇళ్లను మంజూరు చేస్తారు. వారికి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు.
రైతుభరోసా నిధులు...
ఇక రైతు భరోసా నిధులను కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. రైతు భరోసా కింద తొలి విడత నిధులను జమ చేయాలని, ఇందుకోసం విధివిధానాలను కూడా నిర్ణయించింది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తించేలా తొలుత నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పది ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే నిధులను అందచేస్తారు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ పథకం వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా జమ చేయాలని నిర్ణయించింది. సో.. ఒకే పండగకు రెండు గుడ్ న్యూస్ లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించబోతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now